కేసీఆర్‌ విస్మరించారు.. జాప్యం చేస్తే ఊరుకోం : ఎంపీ అసద్

ABN , First Publish Date - 2021-06-22T18:11:00+05:30 IST

రాజధానిలో మూడు వైపులా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నట్టు

కేసీఆర్‌ విస్మరించారు.. జాప్యం చేస్తే ఊరుకోం : ఎంపీ అసద్

  • ఉస్మానియాకు వెయ్యి కోట్లు విడుదల చేయాలి
  • హెరిటేజ్‌ పేరుతో జాప్యం చేస్తే ఊరుకోం
  • మజ్లిస్‌ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌ సిటీ : పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి తక్షణం వేయి కోట్లు విడుదల చేయాలని హైదరాబాద్‌ ఎంపీ, మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. ఆస్పత్రి నిర్మించి వందేళ్లు కావడంతో భవనం శిథిలావస్థకు చేరుకుందని, తక్షణం 35 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. పార్టీ శాసనసభ్యులు, మండలి సభ్యులతో కలిసి ఒవైసీ ఉస్మానియా ఆస్పత్రిని సోమవారం సందర్శించారు. వైద్యాధికారులతో తాజా పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వేల కోట్లను రైతుల కోసం, మిషన్‌ భగీరథ వంటి పథకాల కోసం ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి ఉస్మానియాకు వేయి కోట్లు విడుదల చేయడం పెద్ద సమస్య కాదన్నారు. హెరిటేజ్‌ భవనం అనే వివాదం కారణంగా నూతన భవన నిర్మాణా న్ని నిలిపివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఉస్మానియాను విస్మరించిన కేసీఆర్‌..

రాజధానిలో మూడు వైపులా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉస్మానియా విషయాన్ని విస్మరించారన్నారు. కొన్ని వైద్య సేవలను నిలిపి వేయడంతో ఏటా 90 వేలకు పైగా శస్త్ర చికిత్సలు జరిగే ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం 44 వేల లోపే ఆపరేషన్లు జరుగుతున్నాయని అన్నారు. పురాతన భవనాన్ని తొలగిస్తారా..? లేదా.. ? పై వివాదం చేయకుండా తక్షణం కొత్త భవనాన్ని అన్ని హంగులతోనూ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. నూతన భవనానికి హెరిటేజ్‌ నిర్మాణ శైలితో రూపకల్పన చేయాలని సూచించారు. కొవిడ్‌ మొదటి దశలో ఉస్మానియాను చికిత్సాకేంద్రంగా వినియోగించారని గుర్తు చేశారు. నిర్మాణ పనులు జాప్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2021-06-22T18:11:00+05:30 IST