మళ్లీ.. మల్టీ పల్టీ..!

ABN , First Publish Date - 2021-02-06T06:27:19+05:30 IST

2019 జనవరిలో క్యూనెట్‌ మల్టీలెవల్‌ మోసాలు

మళ్లీ.. మల్టీ పల్టీ..!

మళ్లీ మొదలైన మల్టీలెవల్‌ మార్కెటింగ్‌


చాపకింద నీరులా విస్తరిస్తున్న క్యూనెట్‌ దందా

జూమ్‌ సెమినార్‌లతో ఆకట్టుకుంటున్న వైనం

అప్రమత్తంగా ఉండాలంటున్న సైబరాబాద్‌ పోలీసులు


కొద్దిరోజుల పాటు.. స్తబ్ధుగా ఉన్న మనీ మోసగాళ్లు.. మళ్లీ విజృంభిస్తున్నారు. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసాలకు తెరలేపారు. అధిక సంపాదన పేరుతో అమాయకులను బురిడీ కొట్టించి అడ్డంగా రూ. వేల కోట్లు దోచేస్తున్నారు. 

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : 2019 జనవరిలో క్యూనెట్‌ మల్టీలెవల్‌ మోసాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ప్రత్యేకంగా ఈవోడబ్ల్యూ (ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌)ను రంగంలోకి దింపి ఆ మోసాలపై ఉక్కుపాదం మోపారు. పదుల సంఖ్యలో నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. రూ. కోట్లలో డబ్బును ఫ్రీజ్‌ చేశారు. కొంతకాలం విరామం ఇచ్చిన ఈ సంస్థ తిరిగి తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈవోడబ్ల్యూ పోలీసులు పేర్కొంటున్నారు. 


స్టార్‌ హోటళ్ల నుంచి జూమ్‌కు...

ఎక్కడో విదేశాల్లో, వివిధ నగరాల్లో ఉండి ఇక్కడ తమ అనుచరులతో యువతను ఆకట్టుకుంటున్నారు. గతంలో స్టార్‌ హోటళ్లలో నిర్వహించే సెమినార్లను ఇప్పుడు జూమ్‌ యాప్‌లలో నిర్వహిస్తున్నారు. అతి తక్కువ సమయంలో, అతి తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించడం ఎలా..? అంటూ ఉపన్యాసం మొదలు పెడతారు. మీ డబ్బును మా చేతిలో పెట్టండి ప్రతి నెలా ఊహించని విధంగా లాభాలు పొందండి అంటూ ఊదరగొట్టి పెట్టుబడులు పెట్టిస్తారు. ఒక్కసారి వారి చేతికి డబ్బులు వెళ్తే.. తిరిగి రావడం ఉండదు. ఇదంతా మోసమని గుర్తించిన వ్యక్తి.. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం నెల రోజుల్లోపు డబ్బు తిరిగి తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ గడువును వారం రోజులకు మార్చారు. ఆ విషయం తెలియని చాలా మంది అమాయకులు లక్షల్లో పెట్టుబడులు పెడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్‌ క్యూనెట్‌ నిబంధనల ప్రకారం.. ‘‘మీ పెట్టుబడి డబ్బును తీసుకోవడం కుదరదు. మీరు మరో పదిమందిని ఈ స్కీమ్‌లో చేర్పించి పెట్టుబడి పెట్టిస్తే మీకు ఆదాయం వస్తుందని చెబుతారు. డబ్బులు రాబట్టుకోవడానికి వాళ్లు ఇతరులను ఈ ఊబిలోకి దింపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా తెలియకుండానే వేలాది మంది ఈ మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసాలకు బలవుతున్నారు.’’ అని పోలీసులు చెబుతున్నారు.


హాంకాంగ్‌ కేంద్రంగా దందా.. 

హాంకాంగ్‌కు చెందిన వ్యాపారులు విజయ్‌ ఈ శ్వర్‌, జోసెఫ్‌ బిస్‌మార్కు 1998లో హాంకాంగ్‌, మలేసియా ప్రధాన కేంద్రాలుగా క్యూఐ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ పేరుతో సంస్థను స్థాపించారు. (2008లో క్యూనెట్‌గా మార్చేశారు) అనంతరం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో బ్రాంచిలను పెట్టినట్లు సైబరాబాద్‌ పోలీసులు వెల్లడించారు.


ఇదో పద్మవ్యూహం...

ఎంఎల్‌ఎం స్కీమ్‌ ఓ పద్మవ్యూహం వంటిదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడికి డబ్బులు లేకపోతే బ్యాంకు లోన్‌ కూడా ఇప్పిస్తామని వారు ముగ్గులోకి దింపుతున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు చెల్లించిన కొద్దిరోజులకే సంస్థ పంపిన గిఫ్టుల పేరుతో కొన్ని వస్తువులు పార్శిల్స్‌ రూపంలో వస్తాయి. నెల రోజుల తర్వాత డబ్బులు, లాభాలు ఎక్కడ అని నిలదీస్తే అప్పుడు అసలు విషయం చెప్తారు. తమ డబ్బులు రావాలంటే మరికొంత మందిని ఈ స్కీములో చేర్పించాలని, అప్పుడు 10 నుంచి 20 శాతం కమీషన్‌ రూపంలో డబ్బులు వస్తాయని చెప్పి తప్పించుకుంటారు. అప్పుడు పెట్టుబడి పెట్టిన వ్యక్తి ముందుకు వెళ్లలేక, పెట్టిన డబ్బులు వదులుకోలేక వారి పద్మవ్యూహంలో ఇరుక్కుంటున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-02-06T06:27:19+05:30 IST