రేవంత్‌రెడ్డి కబడ్దార్‌.. మహేశ్వర్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ABN , First Publish Date - 2021-08-27T14:10:53+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని

రేవంత్‌రెడ్డి కబడ్దార్‌.. మహేశ్వర్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్ సిటీ/బోయినపల్లి : కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో బోర్డుమాజీ సభ్యులు పాండుయాదవ్‌, నళినికిరణ్‌, లోకనాధంలతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బోయినపల్లి చౌరస్తాలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా ఎన్నికైన అనంతరం కంటోన్మెంట్‌ ప్రాంతానికి రాని రేవంత్‌రెడ్డి భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని అన్నారు. రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి మార్చుకోనిపక్షంలో ఆయనకు తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో బోయినపల్లి మార్కెట్‌యార్డు చైర్మన్‌ టి.ఎన్‌.శ్రీనివాస్‌, ప్రభుగుప్తా, ముప్పిడి మధుకర్‌, కొంతమంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.


సీఎం కేసీఆర్‌తోపాటు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కంటోన్మెంట్‌ బోర్డు ఏడో వార్డు మాజీ సభ్యుడు గురువారం లాల్‌బజార్‌ చౌరస్తాలో రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. రేవంత్‌రెడ్డి ఖబడ్దార్‌ అంటూ నినాదాలు చేశారు. వ్యాఖ్యలను రేవంత్‌రెడ్డి వెంటనే వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు రాజారెడ్డి, విశ్వనాథం, ఆర్కె రామ్‌, నందు, సురేష్‌, వేణు, రాజు సాగర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-27T14:10:53+05:30 IST