రూ.1400 కోట్లు విదేశాలకు మళ్లింపు

ABN , First Publish Date - 2021-12-19T18:00:47+05:30 IST

లోన్‌ యాప్‌ల కేసులో మరో కొత్తకోణం వెలుగుచూసింది. దాదాపు రూ.1400 కోట్లను చైనా కంపెనీలు విదేశాలకు తరలించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

రూ.1400 కోట్లు విదేశాలకు మళ్లింపు

చైనా లోన్‌ యాప్స్‌ కుంభకోణంలో మరో మోసం

హైదరాబాద్‌/హిమాయత్‌నగర్‌: లోన్‌ యాప్‌ల కేసులో మరో కొత్తకోణం వెలుగుచూసింది. దాదాపు రూ.1400 కోట్లను చైనా కంపెనీలు విదేశాలకు తరలించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గుర్తించింది. హాంకాంగ్‌, మారిషస్‌ దేశాలకు ఆ నిధులు మళ్లినట్లు వెల్లడైంది. హైదరాబాద్‌ పరిధిలోని కెనరా బ్యాంకుకు చెందిన ఒక శాఖను నకిలీ ఎయిర్‌ వే బిల్లులు, నకిలీ లాజిస్టిక్‌ బిల్లులు, నకిలీ 15-సీబీ సర్టిఫికెట్ల తో బురిడీ కొట్టించి వందల కోట్ల నిధులను విదేశాలకు పంపించినట్లు ఈడీ  దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ కుంభకోణంలో మోసపోయిన బ్యాంకుల అధికారులను ఈడీ విచారించింది. వారు అందించిన సమాచారం మేరకు ఈడీ అధికారులు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి విదేశాలకు ప్రయాణించినట్లుగా టికెట్లు, ఎయిర్‌పోర్టు లాజిస్టిక్‌ బిల్లులను లోన్‌ యాప్‌ల నిర్వాహకులు సమర్పించడంతో.. ఢిల్లీ ఎయిర్‌పోర్టును నిర్వహించే జీఎంఆర్‌ సంస్థ అధికారులను కూడా పోలీసులు విచారించారు. అయితే అవన్నీ నకిలీ బిల్లులని, తమ రికార్డుల్లో లేవని వారు తేల్చి చెప్పారు. ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు వందల కోట్ల రూపాయల పన్ను చెల్లించినట్లుగా 15-సీబీ పత్రాలకు సైతం నకిలీలను తయారు చేయించి బ్యాంకుకు సమర్పించి, చైనా కంపెనీలు నమ్మించడం సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి లోన్‌ యాప్స్‌ కుంభకోణం కేసును హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు గతేడాదిగా దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలో వేల కోట్ల రూపాయల మోసాల లెక్క తేల్చేందుకు తాజాగా ఈడీ రంగంలోకి దిగింది.  

Updated Date - 2021-12-19T18:00:47+05:30 IST