భూ నకిలీ పత్రాలతో..బిల్డర్‌కు రూ. 7 కోట్లకు టోకరా

ABN , First Publish Date - 2021-03-24T16:35:33+05:30 IST

బంజారాహిల్స్‌లో విలువైన భూమికి నకిలీ పత్రాలు సృష్టించిన కేటుగాళ్లు ఓ వ్యాపారిని బురిడీ కొట్టించారు. డాక్యుమెంట్లు ఒరిజినల్‌ అని నమ్మించి వ్యాపారి...

భూ నకిలీ పత్రాలతో..బిల్డర్‌కు రూ. 7 కోట్లకు టోకరా

సీసీఎస్‎లో ఫిర్యాదు, నిందితుల అరెస్టు

హైదరాబాద్‌/హిమాయత్‌నగర్‌(ఆంధ్రజ్యోతి): బంజారాహిల్స్‌లో విలువైన భూమికి నకిలీ పత్రాలు సృష్టించిన కేటుగాళ్లు ఓ వ్యాపారిని బురిడీ కొట్టించారు. డాక్యుమెంట్లు ఒరిజినల్‌ అని నమ్మించి వ్యాపారి నుంచి రూ. 7 కోట్లు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించగా ఈ వ్యవహారంలో కీలక వ్యక్తులను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45లో ఉన్న మిహిరా బిల్డ్‌కాన్‌ కంపెనీ మేనేజింగ్‌ పార్టనర్‌ చాడ సుఖే‌ష్ రెడ్డి (35) వద్దకు గత ఏడాది జూలై 4న కొంతమంది వచ్చారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లో ఉన్న 9ఎకరాల 17గుంటల భూమి తమదేనని చెప్పారు. ఆ భూమి ఓనర్లుగా తిరుమల రామచంద్రరావు (మొదటి పార్టీ), ధారిపల్లి సంపత్‌ రెండో పార్టీలుగా పరిచయం చేసుకున్నారు. మూడో వ్యక్తి తన పేరు తిరుమల అవినాశ్‌ అని పేర్కొన్నాడు. ఆ జాగాలో రెండెకరాల భూమిని విక్రయిస్తున్నామంటూ సృష్టించిన డాక్యుమెంట్లను చూపించారు. బాధితుడు ఆ డాక్యుమెంట్లు సరైనవేనని నమ్మి కొనుగోలుకు సిద్ధమయ్యాడు. కొనుగోలుకు ముందు డాక్యుమెంట్ల ప్రాసెసింగ్‌ నిమిత్తం రూ.10కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. అందులో భాగంగా వారిద్దరితో ఒప్పందం కుదుర్చుకున్న సుఖేష్ రెడ్డి నిందితులకు విడతల వారీగా ఆన్‌లైన్‌లో రూ. 7 కోట్లు అడ్వాన్సుగా చెల్లించారు. ఆ తర్వాత విచారించగా ఆ స్థలం వారిది కాదని.. ఆ ముగ్గురూ కలిసి మోసం చేశారని సుఖేష్ రెడ్డి గుర్తించారు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా వారు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఈ నెల 1న బాధితుడు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిని విచారించగా ఆయా పత్రాలు చూపి గతంలోనూ కొందరిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-03-24T16:35:33+05:30 IST