‘కరక్కాయ’ బాధితులకు న్యాయం.. కోర్టు అనుమతితో త్వరలోనే ఈ- వేలం!
ABN , First Publish Date - 2021-12-30T16:25:30+05:30 IST
భాగ్యనగరంలో కలకలం సృష్టించిన మల్టీలెవల్ మోసం కేసులో కరక్కాయల..

- 2018లో వెలుగులోకి వచ్చిన మల్టీలెవల్ మోసం
- సీజ్ చేసిన ఆస్తులు అమ్మకానికి..
- సైబరాబాద్ ‘కాంపిటెంట్ అథారిటీ కమిటీ’ కసరత్తు
హైదరాబాద్ సిటీ : భాగ్యనగరంలో కలకలం సృష్టించిన మల్టీలెవల్ మోసం కేసులో కరక్కాయల బాధితులకు త్వరలోనే న్యాయం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఈవోడబ్ల్యూ విభాగం పోలీసులు ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు. కరక్కాయ పొడితో మల్టీలెవల్ మోసానికి తెరతీసిన కేటుగాళ్లు సుమారు 600 మందిని స్కీములో ఇరికించి రూ. 7 కోట్ల మేర స్కామ్ చేశారు. 2018 జూలైలో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. నిందితుల ముఠాను అరెస్టు చేసిన ఈవోడబ్ల్యూ పోలీసులు వారి నుంచి పలు ఖరీదైన వాహనాలు, ఆస్తులను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీని కోర్టు అనుమతితో ఈ వేలం వేసి, వచ్చిన డబ్బులను బాధితులకు పంచి న్యాయం చేయాలని భావిస్తున్నారు.
సన్‌పరివార్ బాటలోనే..
రూ. 150 కోట్లు సన్‌పరివార్ స్కామ్‌లో సీజ్ చేసిన ఆస్తుల వేలం వేసిన సైబరాబాద్ పోలీసులు త్వరలోనే బాధితులకు న్యాయం చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ మేరకు బాధితుల ఫైనల్ జాబితాను సిద్ధం చేస్తున్నారు. సన్‌పరివార్ స్కామ్ కూడా 2018లోనే వెలుగులోకి వచ్చింది. ఇదే బాటలో కరక్కాయ స్కామ్ బాధితులకు త్వరలో న్యాయం చేయనున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. అందుకోసం న్యాయస్థానం అనుమతితో ప్రత్యేకంగా ‘కాంపిటెంట్ అథారిటీ కమిటీ’ ఏర్పాటైంది. ఈ కమిటీలో సీపీ స్టీఫెన్ రవీంద్రతో పాటు, క్రైమ్స్ డీసీపీ, ఈవోడబ్ల్యూ డీసీపీ కవిత, ఇన్‌స్పెక్టర్ భాస్కర్, రెవెన్యూ, ఆర్టీఏ అధికారులు, రంగారెడ్డి జిల్లా చార్టడ్ అకౌంటెంట్ ఉంటారు. సీజ్ చేసిన ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేయడానికి ఇలాంటి ‘కాంపిటెంట్ అథారిటీ కమిటీ’ ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి అని సైబరాబాద్ పోలీసులు అభిప్రాయపడ్డారు.