80 ఏళ్లు దాటిన ఈ దంపతులు కరోనాను ఎలా జయించారో చూడండి..

ABN , First Publish Date - 2021-05-21T19:41:56+05:30 IST

ఇద్దరికీ 80 ఏళ్లు దాటాయి. జీవితంలో అన్నీ చూశారు. కానీ.. కరోనా లాంటి మహమ్మారిని చూడలేదు.

80 ఏళ్లు దాటిన ఈ దంపతులు కరోనాను ఎలా జయించారో చూడండి..

ఇద్దరికీ 80 ఏళ్లు దాటాయి. జీవితంలో అన్నీ చూశారు. కానీ.. కరోనా లాంటి మహమ్మారిని చూడలేదు. అలాంటిది ఒకటి ఉంటుందని ఊహించలేదు. విద్యావంతులు, అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు కూడా. అయినా ఇంట్లోకి, ఒంట్లోకి వైరస్‌ ప్రవేశించింది. ఒక్కసారిగా కలవరం ఆవహించింది. కరోనా పేరుతో జరుగుతున్న బీభత్సం అంతా జ్ఞాపకం వచ్చింది. యువకులు కూడా ఊపిరందక మరణిస్తున్న ఉదంతాలు మనసులో మెదిలాయి. కానీ మెల్లిగా ధైర్యం తెచ్చుకున్నారు. ఎనభైకి పైగా వసంతాలు చూసిన దంపతుల విజయగాథ ఇది.


హైదరాబాద్/కాప్రా : నిలువునా నిండిన కరోనా భయం నుంచి తేరుకోవడానికి కొంత కాలం పట్టింది ఆ వృద్ధ దంపతులకు. అయితేనేం.. కరోనాను జయించి చూపించారు. వ్యాధికి చికిత్స అయిపోయిన తర్వాత కూడా ఏ ఇతర సమస్యలూ తలెత్తలేదు. తమ దైనందిన జీవితం ఎప్పట్లానే సాగిపోతోంది. కాప్రాసర్కిల్‌ హెచ్‌బీ కాలనీ డివిజన్‌ మంగాపురంలో వాసికర్ల జనార్దన్‌రావు (86), కరుణ (83) నివాసం ఉంటున్నారు. కరోనాపై గెలిచిన వారి వివరాలు వారి మాటల్లోనే....


నా పేరు వాసికర్ల కరుణ, మా వారు వాసికర్ల జనార్ధన్‌రావు. నేను గృహిణిని కాగా మా వారు ప్రభుత్వ శాఖలో బ్లాక్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు. మా అబ్బాయిల కుటుంబాలు, మేము వేర్వేరుగానే ఉంటున్నాం. కరోనా రెండో దశ మొదలైనప్పటి నుంచి అన్ని జాగ్రత్తలూ పాటిస్తూనే ఉన్నాం.


రెండో డోసు సమయానికి..

మార్చి 9న కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకున్నాం. రెండో డోసు తీసుకోవాల్సిన సమయం దగ్గర పడగానే మాకు కరోనా వచ్చింది. మా వారు రోజూ బయటకు వెళ్లి కూరగాయలు తేవడం వల్లనో, పని మనిషి మాస్కు లేకుండా కొన్ని రోజులు ఇంట్లో పని చేయడం వల్లనో తెలియదు కానీ మేం మహమ్మారి బారిన పడ్డాం. మొదట నాకు జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు వచ్చాయి. ఆ తర్వాత అవే లక్షణాలతో మావారు కూడా బాధపడ్డారు. ఎంతకూ తగ్గకపోవడంతో మా అబ్బాయి ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు చేయించగా ఏప్రిల్‌ 20న ఇద్దరికీ పాజిటివ్‌ అని తేలింది. ఒక్కసారిగా కలవర పడ్డాం. ఒకరికొక రం ధైర్యం చెప్పుకొని గుండె నిబ్బరం చేసుకున్నాం. సమీపంలోని డాక్టర్‌ ధనుంజయను సంప్రదించగా అజిత్రోమైసిన్‌, డోలో 650తో పాటు మల్టీవిటమిన్‌ ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఆ మందులు ఓ పదిరోజులు వాడాం. మావారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు. నాకు థైరాయిడ్‌ ఉంది. నేను థైరాయిడ్‌ మందులు ఆపలేదు. వాటిని యధావిధిగా తీసుకున్నాను. క్రమంగా జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు తగ్గుతూ వచ్చాయి. టెస్ట్‌ చేయించగా ఈ నెల 10న ఇద్దరికీ నెగెటివ్‌ వచ్బింది.


ఎవరి పనులు వారే చేసుకున్నాం...

ఇంట్లో మేమిద్దరమే ఉండేవాళ్లం. పాజిటివ్‌ అని తెలియగానే పనిపనిషిని రావొద్దని చెప్పాం. ఎవరి పనులు వారే చేసుకున్నాం. మొదటి రెండు రోజులూ కొంత అలసటగా ఉండడటంతో పక్క అపార్టుమెంట్‌లో ఉంటున్న రెండో అబ్బాయి భోజనం తెచ్చి ఇచ్చాడు. మా కోసం ఇబ్బంది పడొద్డని చెప్పి నేనే వంట వండేదాన్ని. మేం వెజిటేరియన్స్‌. ఎప్పటిలాగే పప్పు, కూరగాయలను ఆహారంగా తీసుకున్నాం. సమయానికే భోజనం చేసేవాళ్లం. ఉదయం ఇడ్లీ, ఉప్మా, చపాతీ తినేవాళ్లం. మావారు రోజూ రెండుసార్లు పాలు తాగేవారు. భక్తి కార్యక్రమాలు వచ్చే టీవీ చానళ్లను ఎక్కువసేపు చూసేవాళ్లం. మా అబ్బాయిలు, కూతురు రోజూ ఫోన్‌చేసి మాట్లాడేవారు. మీరేం టెన్షన్‌ పడొద్దని వారికి చెప్పేవాళ్లం. మేం ఏ టెన్షన్‌ లేకుండానే ఇరవై రోజులు గడిపాం. రెండో అబ్బాయి మాత్రం మా గురించి బాగా టెన్షన్‌ పడేవాడు. గతేడాది వాడు కరోనా బారిన పడి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ దేవుడి దయ వల్ల మనోధైర్యంతో కోలుకుని ఇప్పుడు మేమంతా బాగున్నాం. 


ఇంట్లో ఉండి మందులు వాడితే సరిపోతుంది

కరోనా వస్తే అనవసరంగా ఆందోళన చెందవద్దు. భయంతో ఆస్పత్రుల్లో చేరి డబ్బులు పోగొట్టుకోవద్దు. సరైన వైద్యున్ని సంప్రదించి ఇంట్లోనే ఉండి మందులు వాడితే సరిపోతుంది. భయాందోళనలతో ఉన్న వారికి ఏ మందులు ఇచ్చినా వృథా అవుతాయి. మనోధైర్యంతో పాటు కోలుకుంటామన్న ఆత్మవిశ్వాసం ఉండాలి. వృద్ధ దంపతులైన జనార్ధన్‌రావు, కరుణలే ఇందుకు నిదర్శనం. - డాక్టర్‌ జీవీ ధనుంజయ, శ్రీ రామానూజా సేవా ట్రస్ట్‌ చైర్మన్‌  


సోషల్‌ మీడియాకు దూరంగా ఉండండి

సోషల్‌ మీడియాకు ఎంత దూరంగా ఉంటే ప్రస్తుత వాతావరణంలో మానసికంగా అంత ప్రశాంతంగా ఉం డొచ్చు. డాక్టర్లు ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తే కొవిడ్‌ బారి నుంచి బయటపడొచ్చు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినా ఆలోచనలు పాజిటివ్‌గా ఉంటే తొందరగా కోలుకునే అవకాశాలుంటాయి. పాజిటివ్‌ వచ్చిన వాళ్లు ఎక్కువ వ్యాయామాలు చేయవద్దు. ఎంతరెస్ట్‌ తీసుకుంటే అంత మంచిది. ఎలాంటి వ్యాధికి గురైనా మనోధైర్యంతో తొందరగా రికవరీ కావచ్చు. - డా. ఎన్‌.ప్రశాంత్‌ కుమార్‌, పల్మనాలజిస్ట్‌.

Updated Date - 2021-05-21T19:41:56+05:30 IST