తీర్థయాత్రలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-05-05T17:14:04+05:30 IST

పర్యాటకం ప్రహసనంగా మారింది. మాయదారి వైర్‌సతో పూర్తిగా కుదేలైంది. మునుపెన్నడూ చూడని విధంగా నష్టాల సుడిగుండంలో

తీర్థయాత్రలకు బ్రేక్‌

ఆగిన అంతర్‌జిల్లా, రాప్ట్రాల పర్యాటకం

రెండో దశ కొవిడ్‌తో నిలిచిపోయిన బుకింగ్‌లు

ఆయా ప్రదేశాల సందర్శనకు వెనక్కి తగ్గిన టూరిస్టులు

నిలిచిన షిరిడీ, తిరుపతి, నాగార్జునసాగర్‌ ప్యాకేజీలు

అంతంతమాత్రంగా నడుస్తున్న హైదరాబాద్‌- శ్రీశైలం టూర్‌

నష్టాల సుడిగుండంలో పర్యాటక అభివృద్ధి సంస్థ


హైదరాబాద్‌ సిటీ: పర్యాటకం ప్రహసనంగా మారింది. మాయదారి వైర్‌సతో పూర్తిగా కుదేలైంది. మునుపెన్నడూ చూడని విధంగా నష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. దేశీ, విదేశీ పర్యాట కుల మనసుకు నచ్చే ప్రదేశాలు, ఆధ్యాత్మిక  క్షేత్రాలకు తీసుకెళ్తూ విభిన్న వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్న పర్యాటక శాఖ నిర్వహణభారంతో అవస్థలు పడుతోంది. 


తీర్థయాత్రలకు బ్రేక్‌..

కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి 16న మూతపడిన రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, నగరంలోని పార్కులు అదే ఏడాది సెప్టెంబర్‌ 27న తెరుచుకున్నాయి. కొవిడ్‌ ఆంక్షలకు లోబడి తిరుపతి, షిర్డీ, నాగార్జునసాగర్‌, శ్రీశైలం బస్సు ప్యాకేజీలను పునరుద్ధరించారు. పర్యాటకు లూ మాస్కులు ధరించి, శానిటైజర్లతో వివిధ ప్రాంతాల సందర్శనలకు ఆసక్తి చూపారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు హైదరాబాద్‌- తిరుపతి మధ్య ప్రతి శుక్ర, శనివారాల్లో నాలుగు బస్సుల ను నడిపించారు. హైదరాబాద్‌- శ్రీశైలం- నాగార్జున సాగర్‌, హైదరాబాద్‌- సోమశిల- నాగార్జునసాగర్‌ ప్యాకేజీలను నిర్వహించారు. ఈ రెండు టూర్లకు వీకెండ్‌ రోజుల్లో అడ్వాన్స్‌ బుకింగ్‌లు ఉండేవి. కాగా, మహారాష్ట్ర లోని షిర్డీ యాత్రను నవంబర్‌ నుంచి జనవరి వరకు అప్పుడప్పుడు నడిపించారు. మహారాష్ట్రలో ఫిబ్రవరి నుంచి సెకండ్‌ వేవ్‌ కేసులు ఒక్కసారిగా పెరగడంతో ఆ ప్యాకేజీని నిలిపివేశారు. దీంతోపాటు హైదరాబాద్‌- తిరుపతి, హైదరాబాద్‌- సోమశిల యాత్రలకు బ్రేక్‌వేశారు.


ఆదాయానికి గండి..

నగరం, రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలతో పాటు అంతర్‌రాష్ట్ర, అంతర్‌జిల్లా బస్సు యాత్రలతో టూరిజంశాఖకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తుండేది. ఉదాహరణకు రెండు రాత్రులు, ఒక పగలుతో కూడిన హైదరాబాద్‌- తిరుపతి ప్యాకేజీలో పెద్దలకు టికెట్‌ రూ.3400, పిల్లలకు రూ.2,720 తీసుకుంటారు. మూడు పగళ్లు, రెండు రాత్రుల నిడివితో కూడిన హైదరాబాద్‌-షిర్డీ, యాత్రకు రూ.8,286, హైదరాబాద్‌- శ్రీశైలం టూర్‌లో పెద్దలకు రూ.2050, పిల్లలకు రూ.1,650 తీసుకునేవారు. ఆయా యాత్రలకు సంబంధించి ఒకసారి బస్సు వెళ్లి వస్తే పర్యాటకశాఖకు 60 శాతం ఆదాయం సమకూరేది. ప్రధానంగా వారంలో రెండు రోజులు ప్రత్యేకంగా నడిచే తిరుపతి, వారంపాటు కొనసాగే నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్యాకేజీలతో భారీ డిమాండ్‌ ఉండేది. ఈ టూర్ల ద్వారానే పర్యాటకశాఖ ఆదాయం పెరుగుతుండేది. కొవిడ్‌ రెండో దశ నేపథ్యంలో టూరిజం ఆదాయానికి భారీగా గండిపడింది.


ఇటు నగర పర్యాటకంతోపాటు అటు అంతర్‌రాష్ట్ర తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో నెల రోజులుగా ప్యాకేజీలను నిలిపివేశారు. బస్సు టూర్లు నడవకపోవడంతో రెండు నెలలుగా టూరిజంశాఖకు రూ. 30 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం పర్యాటకుల సంఖ్యను బట్టి హైదరాబాద్‌-శ్రీశైలం ప్యాకేజీని మాత్రమే నడిపిస్తున్నట్లు టూరిజం అధికారి ఒకరు తెలిపారు. ఈ టూర్‌కు వెళ్లే వారు మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని నెగిటివ్‌ రిపోర్టుతో బస్సు ఎక్కాల్సి ఉంటుందని, లేకుంటే అనుమతించేదిలేదని చెప్పారు. కొవిడ్‌ రెండో దశ కేసులు పూర్తిగా తగ్గేవరకు అంతర్‌జిల్లా, రాష్ట్ర తీర్థయాత్రలకు సంబంధించిన ప్యాకేజీలను పునరుద్ధరించే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2021-05-05T17:14:04+05:30 IST