‘మనుషుల ప్రాణాలు పోతుంటే.. కుక్క ప్రాణాలు ముఖ్యమా..?’
ABN , First Publish Date - 2021-05-21T19:48:25+05:30 IST
అనారోగ్యానికి గురైన కుక్కపిల్లను ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని

హైదరాబాద్/బంజారాహిల్స్ : అనారోగ్యానికి గురైన కుక్కపిల్లను ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పిన వాహనదారుడిపై బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ శివచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం సమయంలో చౌరస్తావద్ద బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కుక్కను తీసుకొని ఓ వ్యక్తి వెళ్తుండగా, పోలీసులు ఆపి ప్రశ్నించారు. తన కుక్కకు ఆరోగ్యం బాగోలేదని, దాన్ని ఆస్పత్రిలో చూపించేందుకు వెళ్తున్నానని కుక్క యజమాని సమాధానమిచ్చాడు. కరోనా ప్రమాదకరంగా మారి మనుషుల ప్రాణాలు పోతుంటే, ‘మీకు కుక్క ప్రాణాలు ముఖ్యమా’ అని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్క కు అనారోగ్యంగా ఉంటే వీడియోకాల్ ద్వారా డాక్టర్‌ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి కానీ, ఆస్పత్రి పేరుతో లాక్‌డౌన్ సమయంలో రోడ్లపైకి రావడం సరికాదన్నారు. అనారోగ్యంతో ఉంటే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా పెంపుడు కుక్కను అలా ఎలా వదిలేస్తామని వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశారు.