సినిమాను తలపించేలా ఆటవిక దాడి

ABN , First Publish Date - 2021-06-21T17:01:02+05:30 IST

సమయం ఆదివారం ఉదయం 6.30 అవుతోంది. సినిమాను తలపించేలా ఇద్దరు వ్యక్తుల బీభత్సం.

సినిమాను తలపించేలా ఆటవిక దాడి

  • నలుగురికి తీవ్రమైన గాయాలు
  • ఒకరి పరిస్థితి విషమం 
  • లొంగిపోయిన నిందితులు


హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : సమయం ఆదివారం ఉదయం 6.30 అవుతోంది. సినిమాను తలపించేలా ఇద్దరు వ్యక్తుల బీభత్సం. వారిలో ఒకరు కత్తితో నలుగురిని వెంబడిస్తున్నారు. రోడ్డుపైనే వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తుకారాంగేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది...


ఎస్‌ఐ వరుణ్‌ కాంత్‌రెడ్డి కథనం ప్రకారం ఈ దాడికి సంబంధించిన వివరాలు... అడ్డగుట్ట ఆజాద్‌ చంద్రశేఖర్‌ నగర్‌కు చెందిన బాలామణి తన బంధువు సురేష్‌ పెళ్లికి హాజరై ఈనెల 17న ఆజాద్‌ చంద్రశేఖర్‌నగర్‌ బస్తీ నుంచి నడుచుకుంటూ వస్తుండగా అక్కడే ఉన్న శేఖర్‌ ఆమెను వెంబడించి వేధించాడు. దీంతో బాలామణి అతడిని మందలించింది. అతని ఇంటికి వెళ్లి శేఖర్‌ తండ్రి కృష్ణకు విషయం చెప్పింది. తండ్రి కూడా శేఖర్‌ను మందలించాడు. ఇంటికి చేరుకున్న బాలామణి భర్త యాదగిరికి కూడా విషయం అంతా చెప్పింది. ఆగ్రహానికి గురైన యాదగిరి ఈ నెల 19 ఉదయం 6.30 సమయంలో బంధువులు ప్రవీణ్‌ (చేర్యాల అర్జునబట్ల గ్రామంలో వీఆర్‌ఓ), నోముల పరుశరాం, ప్రతాప్‌ కుమార్‌లతో కలిసి శేఖర్‌ ఇంటికి వెళ్లి నిలదీశాడు.


ఆన్‌లైన్‌ ద్వారా కత్తి తెప్పించుకుని..

‘మా నాన్నతో చెప్పి తిట్టిస్తారా’ అంటూ శేఖర్‌ వీళ్లపైనే గొడవకు దిగాడు. ఈ ఘర్షణలో శేఖర్‌ తల్లి కిందపడింది. దీంతో కోపోద్రిక్తుడైన శేఖర్‌ (25), అతని తమ్ముడు సర్వేశ్‌ (20) హెల్మెట్‌, దుడ్డుకర్రలతో అవతలి వారిపై దాడికి దిగారు. ఆన్‌లైన్‌ ద్వారా తెప్పించుకున్న కత్తితో శేఖర్‌, హెల్మెట్‌తో సర్వేశ్‌ రోడ్డుపైకి వచ్చి ప్రవీణ్‌, యాదగిరి, ప్రతాప్‌, పరుశరాంలపై దాడికి పాల్పడ్డారు. రోడ్డుపైనే కత్తితో, హెల్మెట్‌తో దాడికి పాల్పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో నలుగురికీ తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఆ కత్తిని ఇంటి పై కప్పుపై పడేసి శేఖర్‌, సర్వేశ్‌  పారిపోయారు. బాధితులు రక్తపు మరకలతోనే పోలీస్‌‌స్టేషన్‌కు వెళ్లారు. తుకారాంగేట్‌ పోలీసులు బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు బస్తీకి వెళ్లి శేఖర్‌, సర్వేశ్‌ల కోసం గాలించారు. వారి తల్లిదండ్రులు కృష్ణ, బుజ్జమ్మలను ఠాణాకు తీసుకొచ్చారు. 


లొంగిపోయిన నిందితులు 

దాడికి పాల్పడిన అనంతరం అన్నదమ్ములు మారేడుపల్లి టీచర్స్‌ కాలనీ, మహేంద్రాహిల్స్‌ ప్రాంతంలో తలదాచుకున్నారు. కాగా, పోలీసుల నుంచి శేఖర్‌కు ఫోన్‌ వచ్చింది. తల్లిదండ్రులను పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారని సమాచారం రావడంతో ఘటన జరిగిన రెండు గంటల తర్వాత వారు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. బాధితుల గాయాలతో పోలీ్‌సస్టేషన్‌ అంతా రక్తపు మరకలు కనిపించాయి. 


వణికిపోయిన బస్తీ

ఆదివారం కావడంతో ఉదయాన్నే నిత్యావసరాల కోసం చాలా మంది బయటికి వచ్చారు. కత్తితో స్వైరవిహారం చేస్తూ దాడికి పాల్పడడంతో బస్తీవాసులు భయపడిపోయారు. కొందరు తెగించి ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 

 

పెళ్లికి పిలవలేదని... 

బాలామణి బంధువు సురేః‌ష్‌కు ఈనెల 17న వివాహమైంది. ఆ వివాహానికి నిందితులను పిలవలేదనే ఈ గొడవ ప్రారంభమైనట్లు బస్తీలో వదంతులు వినిపిస్తున్నాయి. అయితే, పోలీసులు దీన్ని కొట్టిపారేశారు.

Updated Date - 2021-06-21T17:01:02+05:30 IST