సిటీ హెచ్‌ఎంలకు స్థానచలనం?

ABN , First Publish Date - 2021-12-26T17:50:36+05:30 IST

జిల్లాలోని 16 మండలాల పరిధిలో హెచ్‌ఎం గ్రేడ్‌-1 పోస్టులు పది మంజూరు ఉండగా అన్నీ ఖాళీగానే ఉన్నాయి. గ్రేడ్‌-2లో 159 పోస్టులు మంజూరు ఉండగా 74 మంది పనిచేస్తున్నారు. డిప్యూటీ...

సిటీ హెచ్‌ఎంలకు స్థానచలనం?

హైదరాబాద్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులపై బదిలీ కత్తి వేలాడుతోంది. మల్టిపుల్‌ జోన్‌ నేపథ్యంలో ప్రభుత్వం హెచ్‌ఎంలకు ఆప్షన్లు ఇవ్వడంతో ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న సీనియర్లు నగరానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నగరంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారు తప్పనిసరి పరిస్థితిలో ఇక్కడి నుంచి వెళ్లాల్సి వస్తోంది. 


ఆప్షన్లతో హైదరాబాద్‌పై పొరుగు జిల్లాల వారి ఆసక్తి 

మల్టిపుల్‌ జోన్‌ నేపథ్యంలో తప్పని బదిలీ

వ్యతిరేకిస్తున్న హైదరాబాద్‌ టీచర్స్‌ 

ప్రొటెక్షన్‌ ఫోరం 


హైదరాబాద్‌ సిటీ: జిల్లాలోని 16 మండలాల పరిధిలో హెచ్‌ఎం గ్రేడ్‌-1 పోస్టులు పది మంజూరు ఉండగా అన్నీ ఖాళీగానే ఉన్నాయి. గ్రేడ్‌-2లో 159 పోస్టులు మంజూరు ఉండగా 74 మంది పనిచేస్తున్నారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ (డీఐవోఎస్‌) 24 పోస్టుల్లో ఒకరు పనిచేస్తున్నారు. డిప్యూటీ ఈవోలు 12 పోస్టులు మంజూరు ఉండగా అన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో పాఠశాలల పర్యవేక్షణను పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రత్యేక క్యాడర్‌లో ఉన్న హైదరాబాద్‌ను 2018లో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో మల్టిపుల్‌ జోన్‌-2లోకి మా ర్చారు. దీంతో జోన్‌-5, 6, 7 పరిధుల్లోని మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట్‌, జోగుళాంబగద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, సూర్యాపేట్‌, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలను మల్టీపుల్‌ జోన్‌లో చేర్చారు. అయితే ఈ జోన్‌ కిందకు ఉపాధ్యాయులను పరిగణించలేదు. 


15 శాతం మంది జూనియర్లకు స్థానచలనం 

మల్టిపుల్‌ జోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు హైదరాబాద్‌ ప్రత్యేక కేడర్‌లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా నగరంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రేడ్‌-2 జూనియర్‌ హెచ్‌ఎంలకు స్థానచలనం కలగనుంది. నగరంలో పనిచేసే వారికి 24 శాతం హెచ్‌ఆర్‌ఏ వస్తోందని, ఈ కారణంగా పొరుగు జిల్లాల్లో పనిచేస్తున్న సీనియర్లు ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపుతుండటంతో జూనియర్లకు అన్యాయం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘం నాయకులు వాపోతున్నారు. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్‌ జిల్లాను ప్రత్యేక కేడర్‌గానే కొనసాగించాలని హైదరాబాద్‌ టీచర్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం (హెచ్‌టీపీఎఫ్‌) నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

Updated Date - 2021-12-26T17:50:36+05:30 IST