మహిళా కానిస్టేబుల్‌కు అత్తింటి వేధింపులు

ABN , First Publish Date - 2021-05-20T17:22:42+05:30 IST

మహిళా కానిస్టేబుల్‌ను వేధింపులకు గురిచేయడమే కాకుండా, కులం పేరుతో దూషించిన భర్త, అత్తమామలపై జూబ్లీహిల్స్‌ పోలీసులు...

మహిళా కానిస్టేబుల్‌కు అత్తింటి వేధింపులు

హైదరాబాద్/బంజారాహిల్స్‌: మహిళా కానిస్టేబుల్‌ను  వేధింపులకు గురిచేయడమే కాకుండా, కులం పేరుతో దూషించిన  భర్త, అత్తమామలపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రహ్మత్‌నగర్‌కు చెందిన సంధ్యారాణి ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. భర్త మరణించడంతో కుమారుడి(7)తో కలిసి ఉంటోంది. కరీంనగర్‌ గోదావరిఖనికి చెందిన చరణ్‌తేజ్‌ ఉద్యోగాన్వేషణలో నగరానికి వచ్చి రహ్మత్‌నగర్‌లో ఉంటున్నాడు. సంధ్యారాణితో పరిచయం అయింది. ఆమెకు పెళ్లై కుమారుడు ఉన్న సంగతి తెలుసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. సంధ్యారాణి కూడా ఒప్పుకుంది. గతేడాది నవంబరు 7న కూకట్‌పల్లిలోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. రెండు నెలల పాటు ఇద్దరి కాపురం బాగానే సాగింది. అనంతరం చరణ్‌ ఆమెపై అయిష్టత పెంచుకున్నాడు. చెప్పకుండా వెళ్లిపోయాడు. అతని కోసం అన్ని చోట్ల వెతికినా సంధ్యారాణి జనవరిలో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చరణ్‌ సొంతూరిలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు విచారణకు రావాలని సూచించారు. ఇంతలో చరణ్‌ తల్లిదండ్రులు సంధ్యారాణికి ఫోన్‌ చేసి వేధించడంతోపాటు కులం పేరుతో దూషించారు. బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించగా చరణ్‌తో పాటు అతని తల్లిదండ్రులపై 498ఎ, 506,డీపీ యాక్ట్‌ 4,3(1) ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చరణ్‌ను అరెస్టు చేశారు.

Updated Date - 2021-05-20T17:22:42+05:30 IST