HYD : మహిళ హత్య కేసులో ఇంకా వీడని Mystery.. చనిపోయిందెవరు.. చంపిందెవరు.. రంగంలోకి CP మహేష్ భగవత్..
ABN , First Publish Date - 2021-11-19T13:32:51+05:30 IST
ఆమె వయసు సుమారు 30 ఏళ్లు. చూసేందుకు నార్త్ ఇండియన్లా ఉంది...

- దర్యాప్తు ముమ్మరం చేసిన రాచకొండ పోలీసులు
- హతురాలు నార్త్ ఇండియన్‌గా అనుమానం
- ఆమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్
ఆమె వయసు సుమారు 30 ఏళ్లు. చూసేందుకు నార్త్ ఇండియన్లా ఉంది. పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు పరిధి.. కొహెడ గ్రామం సబ్రోడ్డులోని కాలువలో శవమై కనిపించింది. ఆమెను ఎవరో దారుణంగా హత్యచేసినట్లు ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. ఈ నెల 12న వెలుగుచూసిన ఈ ఘటన కలకలం రేపింది. నేటికీ గుర్తుతెలియని మహిళ మృతదేహం మిస్టరీ వీడలేదు.
హైదరాబాద్ సిటీ : గుర్తుతెలియని మహిళ హత్య కేసులో వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. నల్ల టీషర్టు, బ్లాక్ అప్పర్ తెలుపు గీతల ప్యాంట్ ధరించి ఉందనే ఆనవాళ్లతో ఒక ప్రకటనను నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకూ పంపారు. వారం రోజులు గడుస్తున్నా ఎక్కడి నుంచీ ఎటువంటి సమాచారమూ లేదు. సంబంధిత ఆధారాలతో ఎలాంటి మిస్సింగ్ కేసు నమోదు కాలేదని తెలిసింది. దాంతో మహిళ మృతదేహంతో ప్రకటన విడుదల చేసిన పోలీసులు నాలుగురోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది. దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా పోస్టు చేశారు. అయినా ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో రాచకొండ పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు.
ఎక్కడో చంపి ఇక్కడ పడేశారా..?
మహిళ మృతదేహం ఓఆర్ఆర్ పక్కన ఉన్న కాలువలో బయటపడటంతో ఎక్కడో హత్య చేసి, వాహనంలో ఇక్కడకు తీసుకొచ్చి పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శివారు ప్రాంతం కావడం, ఓఆర్ఆర్ జాతీయ రహదారులను కలుపుకొని పోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాల్లో ఆ మహిళను తరలించి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మహిళ వేషధారణ చూస్తే నార్త్ ఇండియాకు చెందిన సంపన్న కుటుంబానికి చెందినవారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆస్తి, కుటుంబ తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు 7901099275, 9491030074, 7901099273, 9494721100, 9490617111 నంబర్లలో సంప్రదించాలని రాచకొండ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

రంగంలోకి..
సీపీ మహేష్ భగవత్ ఆదేశాలతో ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలతో పాటు చుట్టుపక్కల స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో ఆ మహిళ గురించి వాకబు చేస్తున్నాయి. సీసీ టీవీ కెమెరాలను జల్లెడ పడుతున్నాయి. క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో టెక్నికల్, సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరిస్తున్నాయి. మృతదేహం వెలుగులోకి రాకముందు రెండు రోజుల పాటు ఔటర్‌పై వెళ్లిన వాహనాలను కూడా జల్లెడ పడుతున్నాయి. ఎగ్జిట్, ఎంట్రెన్స్‌ల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
