గ్రేటర్ Hyderabad పౌరులకు తియ్యటి శుభవార్త..
ABN , First Publish Date - 2021-12-31T13:15:18+05:30 IST
గ్రేటర్ పౌరులకు శుభవార్త..

- 13 నెలల నీటి బిల్లు మాఫీ
- ఓసీ లేకున్నా.. రెండో కనెక్షన్ ఉన్నా ఉచిత నీరు
హైదరాబాద్ సిటీ : గ్రేటర్ పౌరులకు శుభవార్త. నగరంలోని డొమెస్టిక్ కేటగిరీ వినియోగదారులందరికీ గత 13 నెలలకు సంబంధించిన నీటి బిల్లులను ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ మేరకు వాటర్‌బోర్డుకు పురపాలక శాఖ గురువారం ఆదేశాలతోపాటు మెమోను జారీచేసింది. ఉచిత తాగునీటి పథకం కింద దరఖాస్తుదారుల కస్టమర్ అకౌంట్ నెంబర్(సీఏఎన్)కు ఆధార్ నెంబర్ అనుసంధానం, నల్లాకు మీటర్ ఏర్పాటు, నిర్ణీత ఎత్తు దాటిన భవనాలకు సంబంధించి నివాసయోగ్య పత్రం(ఓసీ) సమర్పణను వాటర్‌బోర్డు తప్పనిసరి చేసింది. రెండో నల్లా కనెక్షన్ ఉన్న వారి విషయంలోనూ కొంత గందరగోళం ఉండేది.
అయితే నివాస యోగ్య పత్రం(ఓసీ) సమర్పించని, రెండో నల్లా కనెక్షన్ ఉన్న వారినీ ఉచిత నీటి పథకానికి అర్హులుగా పేర్కొంటూ జీహెచ్‌ఎంసీ గురువారం మెమో జారీ చేయడంతో గందరగోళానికి తెరపడింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2020 నుంచి ఇప్పటి వరకు 13 నెలలకు సంబంధించి డొమెస్టిక్ కేటగిరీ వినియోగదారులందరికీ నీటి బిల్లు మాఫీ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో 10.08లక్షల మందికి లబ్ధి కలగనుండగా బోర్డుపై రూ.400కోట్ల ఆర్థిక భారం పడనుంది. పురపాలక శాఖ తాజా సూచనల ప్రకారం మురికివాడలు కాని ప్రాంతాల్లో రేపటి నుంచి బిల్లులు జారీ చేయనున్నారు. ఇప్పటికే చెల్లించిన వాటర్ సెస్‌ను ఆయా వినియోగదారులకు భవిష్యత్తులో సర్దుబాటు చేస్తారు. డిసెంబర్ 2020 కంటే ముందు ఉన్న బకాయిలకు వడ్డీతో సహా బిల్లులు ఇవ్వనున్నారు. ఉచిత నీటి పథకం లబ్ధిదారులు 20 వేల లీటర్ల లోపు వాడితే జీరో బిల్లు ఇస్తారు.
