‘గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి’

ABN , First Publish Date - 2021-02-01T06:36:26+05:30 IST

జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని గిరిజన శక్తి అధ్యక్షుడు డాక్టర్‌ వెంకటేష్‌ చౌహన్‌ డిమాండ్‌ చేశారు.

‘గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి’

పంజాగుట్ట, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని గిరిజన శక్తి అధ్యక్షుడు డాక్టర్‌ వెంకటేష్‌ చౌహన్‌ డిమాండ్‌ చేశారు. గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవాధ్యక్షుడు రాజేష్‌ నాయక్‌, ప్రధాన కార్యదర్శి శరత్‌నాయక్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఏడేళ్లుగా గిరిజన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచకపోవడం వలన విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో, బడ్జెట్‌ కేటాయింపులలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం విషయంలో కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబించడం బాధాకరమనన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో గిరిజన సమస్యలపై చర్చించాలని కోరుతూ ఫిబ్రవరి 2వ తేదీన ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు, అన్ని పార్టీల ఎంపీలను కలుస్తామన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని, ట్రైబల్‌ యూనివర్సిటీకి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయించాలని, జీవో నెంబర్‌ 3 పునరుద్ధరించాలని కోరతామన్నారు. సమావేశంలో గిరిజన శక్తి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజారామ్‌నాయక్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోత్స్న, రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ బాలాజీ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-01T06:36:26+05:30 IST