జగడాలతోనే సరి

ABN , First Publish Date - 2021-12-19T16:55:11+05:30 IST

పాలకమండలి కొలువుదీరిన పది నెలలకు శనివారం మొదటిసారి భౌతికంగా జరిగిన జీహెచ్‌ఎంసీ రెండో సాధారణ సమావేశం తూతూమంత్రంగా ముగిసింది. ప్రజా సమస్యలపై కనీస చర్చ

జగడాలతోనే సరి

తూతూ మంత్రంగా ప్రశ్నోత్తరాలపై చర్చ 

తొలి కౌన్సిల్‌లోనే పోటాపోటీ నినాదాలు.. నిరసనలు

ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరైన మేయర్‌

అర్ధాంతరంగా సమావేశం వాయిదా

ఆమె తీరుపై సొంత పార్టీ కార్పొరేటర్లూ అసంతృప్తి

రోశయ్య స్మృతివనం ఏర్పాటు చేయాలి : రేవంత్‌ 


హైదరాబాద్‌ సిటీ: పాలకమండలి కొలువుదీరిన పది నెలలకు శనివారం మొదటిసారి భౌతికంగా జరిగిన జీహెచ్‌ఎంసీ రెండో సాధారణ సమావేశం తూతూమంత్రంగా ముగిసింది. ప్రజా సమస్యలపై కనీస చర్చ జరగకుండానే మీటింగ్‌ను మమ అనిపించారు. సభ్యులు అడిగిన మెజార్టీ ప్రశ్నలకు లిఖితపూర్వకంగా స్పష్టమైన సమాధానం ఇవ్వని వివిధ విభాగాల అధికారులు సమావేశంలోనూ వివరాలు వెల్లడించలేదు. పౌర సమస్యలు, నిధుల గోల్‌మాల్‌పై ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించడంతో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఉక్కిరిబిక్కిరయ్యారు. ఓ దశలో సభను అదుపు చేయలేక వాయిదా వేసి బయటకు వెళ్లిపోయారు. బలమైన ప్రతిపక్షం ఉన్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై అర్ధవంతమైన చర్చ జరుగుతుందని భావించగా, సమావేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘జై తెలంగాణ’ అని అధికార పార్టీ సభ్యులు, ‘భారత్‌మాతాకి జై’ అని బీజేపీ కార్పొరేటర్లు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో కౌన్సిల్‌లో రసాభాస నెలకొంది. బీజేపీ కార్పొరేటర్లు పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మేయర్‌ తీరుపై కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లకు ఎక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వడం, తాము మాట్లాడుతున్న సమయంలో మైక్‌ కట్‌ చేయడమేంటని ఆగ్రహించారు. అధికారులను వెనకేసుకొచ్చినట్టు మే యర్‌ వ్యవహరించడం ప్రజా సమస్యలపై చర్చను పక్కదారి పట్టించడమేనని బీజేపీ కార్పొరేటర్‌ ఒకరు విమర్శించారు. 


కరోనా మృతుల లెక్కలివ్వండి..

శ్మశానవాటికల నిర్వహణపై చర్చ జరిగిన సందర్భంగా ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడారు. 2019 నుంచి ఎంత మంది చనిపోయారు, అందులో కరోనా మృతులెందరు, ఎందరిని పూడ్చిపెట్టారు, విద్యుత్‌ దహన వాటికల్లో దహనం చేసింది ఎందరిని, కట్టెలతో ఎందరిని కాల్చారు, ఎంత ఖర్చు పెట్టారు వివరాలు ఇవ్వాలన్నారు. చాలా శ్మశానవాటికల్లో వివరాలు నమోదు చేయలేదని, దీంతో మరణ ధ్రువీకరణ పత్రం పొందడంలో కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అన్ని శ్మశాన వాటికల్లో మరణ వివరాలతో రికార్డు మెయింటెయిన్‌ చేయాలని కోరారు. ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి మాట్లాడుతూ.. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ వంటి కనీస సేవలందించే స్థితిలో జీహెచ్‌ఎంసీ లేకపోవడం విచాకరమని అన్నారు. కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ సమాధానమిస్తూ మరణ వివరాలు దాదాపుగా నమోదు చేశామని, ఏ కారణం వల్ల చనిపోయారన్నది ఆస్పత్రి ఆన్‌లైన్‌లో నమోదు చేసే వివరాల్లో ఉంటుందని, మరణ ధ్రువీకరణ పత్రంలో చావుకు కారణం ఉండదని చెప్పారు. 


కేంద్ర నిధులేవి : బీజేపీ 

ఫైనాన్స్‌ కమిషన్‌ కింద కేంద్రం ఇస్తోన్న నిధులేవి, ఏం చేస్తున్నారు, వం దల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంచడం వల్ల అభివృద్ధి, నిర్వహణ పనులపై ప్రభా వం పడుతోంది.. అని బీజేపీ కార్పొరేటర్‌ మధుసూదన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ నిధులపై సమాధానమివ్వాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టగా, విజయలక్ష్మి కౌన్సిల్‌ను ఐదు నిమిషాలు వాయిదా వేశారు. 


సంతాపం

మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, త్రివిధ దళాధిపతి బిపిన్‌రావత్‌ దంపతులతోపాటు మృతి చెందిన 14 మంది, మాజీ ఎమ్మెల్యే గడ్డం రామస్వామి, లింగోజిగూడ కార్పొరేటర్‌ ఆకుల రమేష్‌ మృతిపై సంతాపం ప్రకటిస్తూ మౌనం పాటించారు. 

హైదరాబాద్‌లో రోశయ్య స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారని, ఆయన ఆస్తులు, గుర్తింపులు ఇక్కడే ఉన్నాయని, రోశయ్య జ్ఞాపకార్థం స్మృతివనం ఏర్పాటుకు తీర్మానం చేయాలని రేవంత్‌ రెడ్డి కోరారు.


మీడియాపై ఆంక్షలు

కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా జీ హెచ్‌ఎంసీలో మీడియాపై ఆంక్షలు విధిం చారు. మీడియా గ్యాలరీలోకి పాత్రికేయు లను అనుమతించలేదు. పూర్వ ఎంసీ హెచ్‌, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ చరిత్రలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. దీంతో జర్నలిస్టులు కౌన్సిల్‌ హాల్‌, మేయర్‌ ఛాం బర్‌ ఎదుట బైఠాయించారు. దాదాపు నాలుగు గంటలపాటు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్‌ కార్పొరేటర్లు బైఠాయించారు. మీడియాపై ఆంక్షలు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆదేశాలని అధికారులు, కమిషనర్‌ నిర్ణయమని మేయర్‌ చెప్పడం గమనార్హం. 


ప్రశ్నలన్నీ చర్చించకుండానే..

కౌన్సిల్‌లో చర్చకు 22 ప్రశ్నలను ఎంపిక చేశారు. ఇందులో బీజేపీ- 11, ఎంఐఎం-7, టీఆర్‌ఎస్‌-3, కాంగ్రెస్‌ సభ్యులకు సంబంధించి ఒక ప్రశ్న ఉన్నాయి. మొత్తం ప్రశ్నలపై చర్చ జరగకుండానే సమావేశాన్ని నిరవధిక వాయిదా వేస్తున్నట్టు మేయర్‌ ప్రకటించారు. పట్టణ ప్రణాళికా విభాగంలో అవినీతిపై పలువురు సభ్యులు అధికారుల తీరును ఎండగట్టారు. నాలాల విస్తరణకు సంబంధించి అధికారులు ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ు నాలుగు గంటలపాటు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్‌ కార్పొరేటర్లు బైఠాయించారు. మీడియాపై ఆంక్షలు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆదేశాలని అధికారులు, కమిషనర్‌ నిర్ణయమని మేయర్‌ చెప్పడం గమనార్హం. 

Updated Date - 2021-12-19T16:55:11+05:30 IST