దూషించాడని స్నేహితుడినే హత్య చేశాడు..!

ABN , First Publish Date - 2021-05-18T12:23:39+05:30 IST

ఇద్దరు స్నేహితుల మధ్య మద్యంమత్తులో జరిగిన దూషణలు

దూషించాడని స్నేహితుడినే హత్య చేశాడు..!
మృతుడు శ్యామ్‌సుందర్‌

హైదరాబాద్/నేరేడ్‌మెట్‌ : ఇద్దరు స్నేహితుల మధ్య మద్యంమత్తులో జరిగిన దూషణలు హత్యకు దారి తీశాయి. తీవ్రపదజాలంతో దూషించాడన్న కక్షతో స్నేహితున్ని వెంటాడి మరీ కొట్టి హత్యచేశాడు. ఈ సంఘటన నేరేడ్‌మెట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతనగర్‌లోని కృపా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న మంచికంటి శ్యాంసుందర్‌ (31) ప్రైవేటు ఉద్యోగి. తల్లి రేణుకాతో కలిసి నివసిస్తున్నాడు. నేరేడ్‌మెట్‌ కృపాకాంప్లెక్స్‌లోని విజయా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న పులగం నవీన్‌(33) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరూ  రెండేళ్ల నుంచి స్నేహితులు. శ్యాంసుందర్‌ గతంలో ఒకసారి మద్యం మత్తులో నవీన్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు.


దీంతో అతనిపై నవీన్‌ కక్ష పెంచుకొన్నాడు. సమయం కోసం వేచిచూశాడు. ఆదివారంరాత్రి మద్యంమత్తులో శ్యాంసుందర్‌ ఇంటికి చేరుకోగా అర్ధరాత్రి తర్వాత నవీన్‌ అతని ఇంటికెళ్లాడు. తలుపు తట్టి పిలవగా అతని తల్లి రేణుక తలుపు తీసింది. వెంటనే ఇంట్లోకి ప్రవేశించిన నవీన్‌ కర్రతో శ్యాంసుందర్‌పై దాడి దిగాడు. అడ్డుకోబోయిన అతని తల్లిని సైతం కొట్టి పక్కకు నెట్టాడు. బయటకు పరిగెత్తిన శ్యాంసుందర్‌ను వదలకుండా వెంటాడి కర్రతో దాడి చేయగా అతను కింద పడ్డాడు. ఆ తర్వాత సిమెంట్‌ బ్రిక్‌తో అతనిపై నవీన్‌ విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. తల్లి రేణుక 100కు డయల్‌ చేయగా నేరేడ్‌మెట్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. సీఐ నరసింహస్వామి ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌ టీమ్‌ను, డాగ్‌ స్కాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శ్యామ్‌సుందర్‌ తల్లి రేణుక ఇచ్చిన ఫిర్యాదుతోపాటు సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నవీన్‌ హత్య చేసినట్లు నిర్ధారించి అరెస్టు చేశారు. 

Updated Date - 2021-05-18T12:23:39+05:30 IST