కనుల పండువగా గురుపూర్ణిమ వేడుకలు
ABN , First Publish Date - 2021-07-24T06:47:19+05:30 IST
సాయినాథునికి ప్రీతిపాత్రమైన గురుపూర్ణిమను శుక్రవారం భక్తులు కన్నుల పండువగా జరుపుకున్నారు.

దిల్సుఖ్నగర్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): సాయినాథునికి ప్రీతిపాత్రమైన గురుపూర్ణిమను శుక్రవారం భక్తులు కన్నుల పండువగా జరుపుకున్నారు. తెల్లవారుఝామునుంచే బాబా దర్శనం కోసం భక్తులు ఆలయం ముందు క్యూ కట్టారు. భక్తజన సందోహంతో భక్తుల భజనలు, సాయి నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ షిర్డి సాయి సంస్థాన్ ప్రత్యేకశోభను సంతరించుకుంది. ప్రత్యేక అలంకరణల నడుమ స్వర్ణ సింహాసనంపై కొలువుదీరిన సాయిబాబా దర్శనంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు
తగ్గిన భక్తుల రద్దీ..
వేలాదిగా భక్తులు తరలివస్తారని భావించిన సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు అందుకు తగ్గట్లుగానే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకల ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా గురుపూర్ణిమ రోజు సుమారు 60వేల నుంచి 70 వేల మంది భక్తులు బాబా దర్శనానికి వచ్చేవారు. కొవిడ్ నేపథ్యంలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఈ సారి 10వేల మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు.
ప్రత్యేక క్యూ లైన్లతో దర్శనం..
బాబా దర్శనానికి వీఐపీలు వచ్చిన నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీలు, అన్నదాతలకు ప్రత్యేక మార్గం ద్వారా దర్శనానికి అనుమతించారు. వృద్ధులు, చిన్నారులకు, దివ్యాంగులకు, సాధారణ భక్తులకు వేర్వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
చంపాపేట: రాజిరెడ్డినగర్కాలనీలోని షిరిడిసాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. కార్పొరేటర్ వంగా మధుసూదన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు పోరెడ్డి రవీందర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ అనంతలక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
వనస్థలిపురం: బీఎన్‌రెడ్డినగర్‌లోని బాలాజీనగర్ సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు గురుపౌర్ణిమి వేడుకలను నిర్వహించారు. కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పూజలు నిర్వహించారు. బాలాజీనగర్ ప్రధాన కార్యదర్శి ముడుపు సందీ్‌పరెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, ఆదిలక్ష్మి, భ్రమరాంబ, లక్ష్మి, సుధ, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.
పూజలో సీపీ మహేశ్ భగవత్, శ్రీనివాస్‌గుప్తా
వీఐపీలు, వేలాది మంది భక్తులు బాబా దర్శనానికి వస్తారని భావించిన పోలీసులు, ట్రస్ట్ సభ్యులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సరూర్‌నగర్ పోలీసులు బలగాలను మోహరించారు. సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ బచ్చుగంగాధర్, ప్రధానకార్యదర్శి నాగేశ్వరరావుశర్మ, అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గుండ మల్లయ్య, మాజీ చైర్మన్లు వూర నర్సింహగుప్తా, వనం యాదయ్య, శ్యామ్‌కుమార్, సాయి, శ్యామలరావులతోపాటు ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాచకొండ సీపీ మహే్‌షభగవత్, తెలంగాణ టూరిజం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివా్‌సగుప్తా బాబా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.