నాలాల్లోకి రసాయన వ్యర్థాలు

ABN , First Publish Date - 2021-01-12T06:41:02+05:30 IST

సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడలోని డ్రైనేజీ

నాలాల్లోకి రసాయన వ్యర్థాలు

యథేచ్చగా డంపింగ్‌ చేస్తున్న పరిశ్రమలు

అగ్నిప్రమాద ఘటనతో వెలుగులోకి..


హైదరాబాద్‌ సిటీ/సనత్‌నగర్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడలోని డ్రైనేజీ నాలాలో చెలరేగిన మంటలు, రసాయన వ్యర్థాల నిర్వహణ తీరును బట్టబయలు చేశాయి. కాలుష్య నియంత్రణ మండలి ప్రాంగణానికి కూతవేటు దూరంలో ఉన్న పరిశ్రమలు కూడా వ్యర్థాలను నాలాల్లో పారబోస్తున్నాయని ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంతో మరోసారి వెలుగులోకి వచ్చింది. రసాయనిక వ్యర్థాల శుద్ధికి అయ్యే ఖర్చు మిగుల్చుకునేందుకు కొన్ని సంస్థలు గుట్టుచప్పుడు కాకుండా నాలాల్లో డంప్‌ చేస్తున్నాయి. సనత్‌నగర్‌లో ఆదివారం జరిగిన ప్రమాద కారణాలను విశ్లేషిస్తే అనేక అంశాలు ముందుకొస్తున్నాయి. సమీపంలో ఉన్న ఓ పరిశ్రమ వ్యర్థాలను శుద్ధి చేయకుండా నాలాలోకి వదిలేయడమే ఇందుకు కారణమని స్థానికులు ఆరోపించారు. సదరు సంస్థలో వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ లేని కారణంగా వ్యర్థాలను లారీల ద్వారా తరలించేవారని, కొంత కాలంగా డ్రైనేజీ గుండా సమీపంలో ఉన్న నాలాలోకి వదులుతున్నారని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో అన్ని సంస్థలూ ఆదివారం సెలవు ప్రకటించగా... ఆ పరిశ్రమ నడిచిందని, అక్కడి నుంచే వ్యర్థాలు నాలాలోకి వచ్చాయని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఈ సంస్థపై పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. 


తప్పిన పెను ప్రమాదం 

ఆదివారం సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా డ్రైనేజీ పైపుల వెంట వేసిన కేబుల్‌ వైర్లు కాలిపోయాయి. మంటలు మరో 2 అడుగుల ఎత్తుకు వ్యాపించి ఉంటే పైన ఉన్న కరెంట్‌ తీగలను తాకేవి. తీగలకు ఉన్న ఇన్సులేషన్‌ కాలిపోతే షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించేది. ఫైర్‌ సిబ్బంది సమయానికి వచ్చి మంటలు ఆర్పకపోతే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వెలిబుచ్చారు. 


జిగ్‌జాగ్‌ డ్రైనేజ్‌

ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైపులు ఒక వైపు నుంచి కాకుండా పలుమార్గాల నుంచి కలపడం వల్ల వ్యర్థాలు ఎటువైపునుంచి నాలాలోకి వచ్చాయనే విషయాన్ని కచ్చితంగా చెప్పడం అధికారులకు కూడా కష్టంగా మారింది. గతేడాది జనవరిలో ఈ ప్రాంతంలో నూతన సీసీ రోడ్‌ నిర్మాణం జరిగింది. అదే  సమయంలో ఓ కెమికల్‌ కంపెనీకి చెందినవారు రాత్రికి రాత్రే ఎక్స్‌కవేటర్‌తో తవ్వి తమ సంస్థ నుంచి వ్యర్థాలు పోయేలా డ్రైనేజీ పైపులకు లైను కలిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 


ఊపిరి తీసుకోలేకపోతున్నాం

శుద్ధి చేయని వ్యర్థాలను విచ్చలవిడిగా నాలాల్లో కలపడం ద్వారా దుర్వాసనలతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి చిన్నపిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. గతంలో ఇంట్లో పెంచుకున్న గొర్రెలు ఈ నీటిని తాగి మృత్యువాత పడ్డాయని స్థానికులు తెలిపారు. 

Updated Date - 2021-01-12T06:41:02+05:30 IST