Manikonda మున్సిపాలిటీకి Double Shock... ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో బట్టబయలు..!

ABN , First Publish Date - 2021-08-20T14:28:10+05:30 IST

మణికొండ మున్సిపాలిటీకి డబుల్‌షాక్‌ తగిలింది. ఆరునెలల పాటు...

Manikonda మున్సిపాలిటీకి Double Shock... ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో బట్టబయలు..!

  • కౌన్సిలర్‌ సస్పెన్షన్‌ - ఏఈ సరెండర్‌
  • మణికొండ మున్సిపాలిటీకి ఝలక్‌
  • గుడికూల్చిన కేసులో కౌన్సిలర్‌కు దండన

హైదరాబాద్ సిటీ/నార్సింగ్‌ : మణికొండ మున్సిపాలిటీకి డబుల్‌షాక్‌ తగిలింది. ఆరునెలల పాటు ఓ కౌన్సిలర్‌ సస్పెన్షన్‌కు గురికాగా, ఏఈని ప్రభుత్వానికి  సరెండర్‌ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. మణికొండ మున్సిపాలిటీలో ఓ బిల్డర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ దేవాలయ నిర్మాణాన్ని కూల్చివేయించి బాత్‌రూం నిర్మాణం చేయిస్తున్నారన్న ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు ఏడవ వార్డు కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ బి. పద్మారావుపై ఆరు నెలలపాటు సస్పెన్షన్‌ వేటు వేశారు. ప్రాథమిక విచారణలో పురాతన గుడిని తానే కూల్చివేయించినట్లు కౌన్సిలర్‌ ఒప్పుకున్నారని, అందుకే ఆరునెలలు సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారని కమిషనర్‌ జయంత్‌కుమార్‌ తెలిపారు. 


పూర్తిస్థాయి విచారణలో దోషి అని తేలితే ఇతన్ని పదవినుంచి తొలగిస్తారని ఆయన పేర్కొన్నారు. ఐదు నెలల క్రితం నెక్‌నాంపురలోని పురాతన గ్రామదేవతల ఆలయాన్ని కౌన్సిలర్‌ కూల్చినట్లు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదయింది. మరికొన్ని స్థలాల విషయాల్లోనూ పలువురిని బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని సీసీఎస్‌లో కూడా అతనిపై ఫిర్యాదు అందింది. ఈ దరిమిలా జిల్లా అధికారులు ఈ ఆరునెలల సస్సెన్షన్‌ విధించారు.  


ఏఈ సరెండర్‌..

మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తున్న విఠోభను మున్సిపల్‌ కమిషనర్‌ జయంత్‌కుమార్‌ ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేయకపోవడం,  నాణ్యతగా నిర్వహించకపోవడం వంటి ఆరోపణలు రుజువు కావడం, అతని పనితీరు బాగా లేకపోవడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని కమిషనర్‌ తెలిపారు. మణికొండ, నార్సింగ్‌లో పైప్‌లైన్‌ పనులకోసం మూడు నెలలుగా రోడ్డును తవ్వి వదిలేయడంపై ఈనెల 17న ‘ఆంధ్రజ్యోతి’ మెహిదీపట్నం జోన్‌లో ‘ఇంకెన్నాళ్లు ఈ మరమ్మతులు’ అనే శీర్షికతో కథనం వచ్చింది.


దీంతో స్థానికులు ఏఈపై పెద్దఎత్తున ఫిర్యాదులు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించి ప్రాథమిక విచారణ చేపట్టారు. సదరు ఏఈ పనుల పర్యవేక్షణకు రావడంలేదని, ఎల్‌ఆర్‌ఎస్‌ ఫండ్స్‌తో  చేపట్టిన పనులను పట్టించుకోవడం లేదని, దీంతో నిధులు వృథా అవుతున్నాయని అడిషనల్‌ కలెక్టర్‌ విచారణలో తేలింది. పనుల విషయంలో ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించారని రంగారెడ్డి కలెక్టర్‌ ఏఈ విఠోభను ఆయన సొంతశాఖ (తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌)కు సరెండర్‌ చేశారు. త్వరలో కొత్త ఏఈని నియమిస్తారని కమిషనర్‌ జయంత్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-08-20T14:28:10+05:30 IST