డాక్టర్‌నైనా భయమేసింది.. నా ఇద్దరు కొడుకులకూ వైరస్‌.. !

ABN , First Publish Date - 2021-05-30T18:57:14+05:30 IST

ఆయన గాంధీ ఆస్పత్రి డెర్మటాలజీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌..

డాక్టర్‌నైనా భయమేసింది.. నా ఇద్దరు కొడుకులకూ వైరస్‌.. !

  • ధైర్యంతో కరోనాను జయించా..
  • భార్య, అమ్మ చాలా కష్టపడ్డారు...
  • పది రోజులు ఆస్పత్రిలో ఉన్నాం.. 
  • వంటింటి చిట్కాలు కూడా పాటించా..
  • డాక్టర్‌ కటకం భూమేష్‌ కుమార్‌

హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : ఆయన గాంధీ ఆస్పత్రి డెర్మటాలజీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌. కరోనా కాలంలోనూ ఆయన ఆస్పత్రికి వచ్చే రోగులకు సేవలు చేశారు. ఓ రోజు ఆయనే కరోనా బారిన పడ్డారు. తనకు కరో నా ఎలా సోకిందో ఇప్పటికీ అర్థం కాని విషయం అంటారు ఆయన. చికిత్స చేస్తున్న క్రమంలో తనతో పాటు ఇద్దరు కుమారులూ కరోనా బారిన పడ్డారు. ఆయన సతీమణి, తల్లికి నెగెటివ్‌ రావడం కాస్త ఊరటనిచ్చిన అంశం అం టున్న గాంధీ డెర్మటాలజీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కటకం భూమేష్‌ కుమార్‌ కరోనాను ఎలా జయించారో ఆయన మాటల్లోనే.. 


భయంతో వణికిపోయాం

ఓ రోజు గాంధీలో రోగులకు వైద్యసేవలు అందజేస్తుండగా అలసటగా  అనిపించింది. కొద్దిగా జ్వరం వచ్చినట్లుగా ఉంటే, ఎందుకైనా మంచిదని మందులు వాడా. అనుమానంతో గాంధీలో టెస్ట్‌ చేయించుకున్నా. పాజిటివ్‌ వచ్చింది. ఆ సమయంలోనే ఇద్దరు కుమారుల జ్వరం బారిన పడ్డారు. అందరం భయంతో వణికిపోయాం. ఇద్దరు కుమారులకు టెస్టులు చేయిస్తే పాజిటివ్‌ అని తేలింది. మా అమ్మ శివలింగమ్మకూ పాజిటివ్‌ వచ్చింది. రెండు రోజుల్లోనే మళ్లీ టెస్ట్‌ చేయిస్తే నెగెటివ్‌ వచ్చింది. మా ఆవిడ లక్ష్మికి ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ఏం చేయాలో అర్ధం కాలేదు. పాజిటివ్‌గా తేలిన ముగ్గురం గాంధీ ఆస్పత్రిలో ఆడ్మిట్‌ అయ్యాం. పెద్ద కుమారుడు సాయిచరణ్‌ ఆక్సిజన్‌ లెవల్‌ తగ్గిపోవడంతో హైరాన పడ్డా. దాదాపు పది రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాం. నెగటివ్‌ వచ్చిన తర్వాత కూడా ఇంట్లో హోంక్వారంటైన్‌లో ఉన్నాం. ఆ సయమంలో మా ఆవిడ ధైర్యం చెప్పింది. సమయానికి పౌష్టికాహారం ఇవ్వడం వల్ల క్రమంగా ముగ్గురం సాధారణ పరిస్థితికి వచ్చాం.


ఇంట్లో వారు పదే పదే గుర్తుకొచ్చారు.. 

నేను, మా ఇద్దరు పిల్లలు కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సమయంలో ఇంట్లో వాళ్లు గుర్తుకొచ్చారు. అమ్మ ఆరోగ్యం బాగుందా అని పదే పదే మా ఆవిడకు ఫోన్‌ చేసి తెలుసుకునేవాడిని. డిశ్చార్చి అయ్యాక హోం క్వారంటైన్‌లో ఉన్నా, నా సతీమణి చేసిన సేవలతో సాధారణ స్థితికి వచ్చాం. డాక్టర్‌ను అయినా భయపడ్డా.. కానీ, ధైర్యం తెచ్చుకుని కరోనాను జయించా. ఇప్పుడు ముగ్గురం సేఫ్‌గా ఉన్నాం. 


గ్రామాల్లో తిరిగాం.. 

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఒక వైపు వైద్యం చేస్తూనే.. మరో వైపు  చర్మవ్యాధులపై గాంధీ ఆస్పత్రితో పాటు ఇతర జిల్లాల్లో సదస్సులు నిర్వహించాం. బయటే చాలా రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటా. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆ దేవుడు కనికరించి, కరోనా నుంచి బయట పడేసేలా చేశాడు.  


ఎప్పుడు బయటి వెళ్తానో అనిపించింది.. 

ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న రోజుల్లో ధైర్యం తగ్గింది. త్వరగానే కరోనా నుంచి కోలుకుంటామని అనుకోలేదు.  డాక్టర్‌ను కావడంతో నా కుమారులకు, ఆస్పత్రిలో ఉన్న తోటి వారికి ధైర్యం చెప్పేవాడిని. వారికి ధైర్యం చెప్పినా, నాకు మాత్రం ఎప్పుడు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తానో అనిపించేది.  


కషాయాలు తీసుకున్నాం..

ఇంట్లో కషాయాలు తీసుకున్నాం. ఇమ్యూనిటీ పెంచేందుకు అమ్మ, మా ఆవిడ చాలా కష్టపడ్డారు. ఏ సమయంలో ఎప్పుడు వాడాలో స్వయంగా అమ్మ జాగ్రత్తలు చెప్పేది. అమ్మ చెప్పిన ప్రకారం వంటింటి చిట్కాలు కూడా పాటించాను. ప్రస్తుతం ముగ్గురం ఆరోగ్యంగానే ఉన్నాం. 


భయపడకండి.. 

కరోనా వచ్చిందని ఎవరూ భయపడకూడదు. సరైన సమయంలో మందు లు వాడి ఇంట్లో హోంక్వారంటైన్‌లో ఉంటే సరిపోతుంది. వైద్యులు రాసిచ్చిన ప్రకారం మందులు సక్రమంగా వాడితే చాలు. ఉదయం రాత్రి కషాయం తాగితే కరోనా దరిదాపున రాదు. ఎవరైనా కరోనా వచ్చిందన భయపడకుండా, కరోనా ఎలా జయించాలో ఆలోచిస్తే బాగుంటుంది. 

Updated Date - 2021-05-30T18:57:14+05:30 IST