భాగ్యనగరంతో దిలీప్‌కుమార్‌కు ప్రత్యేకబంధం
ABN , First Publish Date - 2021-07-08T15:09:34+05:30 IST
భాగ్యనగరంతో బాలీవుడ్ స్టార్ దిలీప్‌కుమార్ బంధం ప్రత్యేకమైంది....

హైదరాబాద్ సిటీ : ‘‘భాగ్యనగరంతో బాలీవుడ్ స్టార్ దిలీప్‌కుమార్ బంధం ప్రత్యేకమైంది. తనదైన అభినయంతో భారతీయ సినీ ప్రేక్షకుల హృదయాల్లో ఆయనది సుస్థిర స్థానం. దిలీప్ కుమా ర్ నటనకు నగరవాసులూ ఫిదా అయ్యారు. ఇక్కడి థియేటర్లలో దిలీప్‌కుమార్ సినిమాలు కొన్ని సంవత్సరం కూడా ఆడిన సందర్భాలున్నాయి. దిలీప్ ప్రేమకథకూ సాక్ష్యం.. హైదరాబాద్. అయితే, ఆయన జీవితంలో అదొక విషాద ఘట్టం. ఈ సంగతి తానే ఒక సందర్భంలో ప్రస్తావించారు.’’
సైనిక సంక్షేమ నిధి కోసం ..
దిలీప్‌కుమార్‌తో పాటు బాలీవుడ్‌కి చెందిన రాజ్‌కపూర్, జానీవాకర్, నిమ్మి, నర్గీస్, సాధన తదితర ప్రముఖులు 75 మంది ప్రత్యేక విమానంలో 1963, ఫిబ్రవరి17న ముంబాయి నుంచి హైదరాబాద్ వచ్చారు. వారందరి రాక వెనుక గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. 1962, భారత్, చైనా మధ్య యుద్ధం అనంతరం భారత సైనిక సంక్షేమ నిధికి విరాళాల సేకరణ కోసం సికింద్రాబాద్‌కి చెందిన ప్రముఖ సామాజికవేత్త స్నేహలతాభూపాల్ పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాన్ని రూపొందించారు.
హైదరాబాదీ అయిన ప్రముఖ బాలీవుడ్ నటుడు పైడిజయరాజ్ సహకారంతో ఆ కార్యక్రమానికి బాలీవుడ్ సినీపరిశ్రమ ప్రముఖులను ఆహ్వానించారు. అలా సుమారు అరవై ఏళ్ల కిందట దిలీప్‌కుమార్‌తో సహా వారంతా భాగ్యనగర ఆతిథ్యం స్వీకరించారు. ‘‘రాజ్‌భవన్ వేదికగా స్నేహలతాభూపాల్ నిర్వహించిన కల్చరల్ ఈవెంట్‌లో 75మంది బాలీవుడ్ సినీప్రముఖులు పాల్గొన్నారు. దిలీప్ తదితర నటులు క్రికెట్ కూడా ఆడారు. అనంతరం పద్మారావునగర్‌లోని స్నేహలతాభూపాల్ ఇంటి ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రత్యేక విందులోనూ వారంతా పాల్గొన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమం ద్వారా సైనిక సంక్షేమ నిధికి నగరం నుంచి రూ.1,60,000 విరాళం అందించారు’’ అని పైడిజయరాజ్ జీవితచరిత్రను అక్షరీకరించిన టి. శ్రీకాంత్ చెబుతున్నారు.
- భాగ్యనగరంలో దిలీప్‌కుమార్‌కు అభిమానులు కోకొల్లలు. ఆబిడ్స్‌లోని జమ్రూద్, ప్యాలస్ టాకీసుల్లో దిలీప్ సినిమాలు కొన్ని ఏడాది ఆడినవి కూడా ఉన్నాయి. దిలీప్ సలీం పాత్రలో ఒదిగిన ‘మొగల్-ఏ-ఆజామ్’ చిత్రం ప్యాలస్ టాకీ్‌సలో 365రోజులు ఆడిందని కేపీ ఆశోక్‌కుమార్ గుర్తుచేసుకున్నారు. సికింద్రాబాద్ ప్రశాంత్ థియేటర్ 1976లో దిలీప్ నటించిన ‘బైరాగ్’ సినిమాతోనే ప్రారంభమైంది.
దిలీప్ కుమార్ మరణం ఉర్దూ భాషకు తీరనిలోటు: మనూ
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌కు ఉర్దూ భాషతోపాటు సాహిత్యంలోకూడా మంచి పట్టుందని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వీసీ ప్రొపెసర్ ఎంఎం రహంతుల్లా పేర్కొన్నారు. మనూలో బుధవారం దిలీప్‌కుమార్ స్మృత్యర్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ దిలీప్‌కుమార్ మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకే కాకుండా, ఉర్దూ భాషకు కూడా తీరని లోటన్నారు. ఉర్దూ భాషకు దిలీప్‌కుమార్ వన్నె తీసుకువచ్చారన్నారు. ఉర్దూ భాష, సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఆయన సేవలను గుర్తించిన మనూ 2009లో గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించిందని గుర్తుచేసుకున్నారు. అనారోగ్య కారణాలతో డాక్టరేట్ తీసుకోవడానికి రాలేకపోయినా సందేశంలో స్వదస్తూరితో ఉర్దూలో ప్రఖ్యాత కవిత ఉర్దూ జుబాన్ నుంచి అనేక చరణాలను రాశారన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిద్దిఖీ మహ్మద్ మహమూద్ మాట్లాడుతూ దిలీప్‌కుమార్ సినిమా నటులకే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారన్నారు.

