మృతుడి బంధువుల ఆందోళన
ABN , First Publish Date - 2021-05-21T07:15:07+05:30 IST
కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహం ఇవ్వడానికి రూ. 10 లక్షలు డిమాండ్ చేసింది ఓ ప్రైవేట్ ఆస్పత్రి.

ఆస్పత్రిపై ఆరోపణలు
సర్దిచెప్పిన పోలీసులు
డబ్బు తీసుకోకుండానే మృతదేహం అప్పగింత
రాంగోపాల్‌పేట్, మే 20 (ఆంధ్రజ్యోతి): కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహం ఇవ్వడానికి రూ. 10 లక్షలు డిమాండ్ చేసింది ఓ ప్రైవేట్ ఆస్పత్రి. బాధితులు అప్పటికే చికిత్సకు రూ. 12 లక్షలు కట్టారు. మరో రూ. 10 లక్షలు కడితేనే మృతదేహాన్ని ఇస్తామని చెప్పడంతో మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన పిచ్చయ్య(32) కరోనాతో బాధపడుతూ ఏప్రిల్ 30న సికింద్రాబాద్‌లో ఓ ఆస్పత్రికి వచ్చాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు పెద్దగా సమస్యలేదని జనరల్ వార్డులో చేర్చుకున్నారు. అతడి పరిస్థితి సీరియ్‌సగా ఉండడంతో అదేరోజు రాత్రి ఐసీయూలోకి మార్చారు. మరుసటి రోజు నుంచి ఎన్‌ఐవీ చికిత్స మొదలు పెట్టారు. ఎనిమిది రోజులపాటు చికిత్స చేస్తూ కోలుకుంటున్నాడని చెబుతున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు చనిపోయాడని, రూ. 10 లక్షల బిల్లు పెండింగ్ ఉందని, డబ్బు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని బంధువులకు సమాచారం ఇచ్చారు.
మృతుడి సోదరుడు గురు లింగనాథ్, తండ్రి, భార్య, బంధువులు ఆస్పత్రికి చేరుకొని సరిగా వైద్యం చేయకపోవడం, వైద్యుల నిర్లక్ష్యం వల్లే పిచ్చయ్య చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల కోసం అవసరం లేని వైద్యం చేస్తున్న ఇలాంటి ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి బంధువులు ఆందోళనకు దిగడంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి బాధితులకు సర్దిచెప్పారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు ఆస్పత్రి వద్దకు వెళ్లడంతో డబ్బులు తీసుకోకుండానే మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.