దర్భంగా పార్సిల్ బాంబు కేసులో తాజా అప్డేట్ ఇదీ...
ABN , First Publish Date - 2021-07-03T14:51:23+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లో షామ్లీ జిల్లా కైరానా గ్రానికి చెందిన మహమ్మద్ సలీం అహ్మద్ అలియాస్ హాజీ సలీమ్...

- కేసులో ఎన్ఐఏ వేగం
- మరో ఇద్దరి అరెస్ట్
- మల్లెపల్లి ప్రాంతంలో ఉన్న ఇద్దరు
- స్థానికుల్లో ఆందోళన
హైదరాబాద్ సిటీ : దర్భంగా పార్సిల్ బాంబు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో కీలక సూత్రధారి, ఐదు నెలల క్రితమే పేలుడును ప్లాన్ చేసినట్లు భావిస్తున్న వ్యక్తితో పాటు మరొకరిని శుక్రవారం ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు నలుగురు అరెస్టు అయ్యారు. తాజాగా అరెస్టు అయిన వారిలో ఉత్తరప్రదేశ్‌లో షామ్లీ జిల్లా కైరానా గ్రానికి చెందిన మహమ్మద్ సలీం అహ్మద్ అలియాస్ హాజీ సలీమ్, గపీల్ ఉన్నట్లు ఎన్ఐఏ ప్రకటించింది. వీరిని శుక్రవారం పాట్నా ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో హాజరు పరిచింది. వారిని ఏడు రోజుల రిమాండ్‌కు తరలిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. వారిని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది.
ఇక్బాల్ కానా అనుచరుడు..
తాజాగా అరెస్ట్ అయిన మహ్మద్ సలీం అహ్మద్ అలియాస్ హాజీ సలీమ్ లష్కరే తోయిబాలోని కీలక వ్యక్తి ఇక్బాల్కానాకు అనుచరుడని ఎన్ఐఏ నిర్ధారించింది. ఇక్బాల్కానాకు, పేలుడుకు ప్లాన్ చేసిన నాసిర్‌ఖాన్, ఇమ్రాన్ మాలిక్‌లకు హాజీ సలీం మధ్యవర్తిగా వ్యవహరించాడు. వారికి ప్లాన్ చెప్పడంలో, ఫండ్స్ సమకూర్చడంలో హాజీ సలీమ్ కీలక పాత్ర పోషించాడు. హాజీ సలీం, గపీల్లను యూపీ నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై పాట్నా తరలించి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చనున్నట్లు ఎన్ఐఏ ప్రకటించింది.
తండ్రి దేశభక్తుడు..
దర్బంగా పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ హైదరాబాద్‌లో అరెస్టు చేసిన నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్‌ల తండ్రి మూసాఖాన్ మాజీ సైనికుడు. ఆయన దేశభక్తుడని, సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పోరాటం చేశాడని అధికారులు చెప్పారు. ఆయన సర్వీసులో ఎన్నో పతకాలు, అవార్డులు అందుకున్నారు. 1961లో ఇండియా-చైనా, 1965, 1971లో ఇండియా - పాకిస్థాన్ యుద్ధంలో పోరాడిన ఆ సైనికుడు తన కుమారులు చేసిన ఘాతుకానికి కుమిలిపోతున్నారు. తన కుమారులు దోషులుగా తేలితే కాల్చి చంపేయాలని ఆయన తన దేశభక్తిని చాటుకున్నారు.
కైరానాలో రేషన్‌దుకాణం నడుపుతున్న మూసాఖాన్ హృద్రోగంతో బాధపడుతున్నారు. గతేడాది నుంచి దానినీ నిర్వహించలేని పరిస్థితులలో ఉన్నట్లు సమాచారం. గురువారం ఆయన ఇంట్లో లేరని తెలుస్తోంది. మోకాలి ఆపరేషన్ కోసం ముజఫర్‌నగర్ వెళ్లినట్లు సమాచారం. మూసాఖాన్‌కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. కుమారుల్లో నాసిర్, ఇమ్రాన్ తీవ్రవాద కార్యకలాపాల వైపు మొగ్గు చూపి 2012లో పాకిస్థాన్ వెళ్లారని, అప్పుడే వారి ఉగ్రశిక్షణ మొదలైందని బిహార్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) అధికారులు చెబుతున్నారు. వీరు హైదరాబాద్‌లోని మల్లెపల్లి ప్రాంతంలో నివసిస్తున్నారని, కొన్నేళ్లుగా రోడ్లపై దుస్తుల వ్యాపారం చేసేవారని పొరుగువారు చెబుతున్నారు. ఇన్నాళ్లు తమ ప్రాంతంలో ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారనే విషయం తెలిసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు.