నగరవాసి నుంచి రూ. 60 లక్షలు దోచేసిన Cyber gang
ABN , First Publish Date - 2021-10-20T17:49:52+05:30 IST
రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ట్రేడింగ్ పేరుతో కొత్త రకం మోసానికి తెరతీసిన నేరగాళ్లు షేర్ మార్కెట్లో అనుభవం ఉన్న వారిని సైతం బురిడీ కొట్టించి అడ్డంగా దోచేస్తున్నారు

ట్రేడింగ్ కోసమంటూ వాట్సాప్ గ్రూపులు
లక్షల్లో లాభాలు చూపిస్తూ దోచేస్తున్న కేటుగాళ్లు
యూకే కంపెనీల పేరిట దందా
సైబర్ మాయ
హైదరాబాద్ సిటీ: రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ట్రేడింగ్ పేరుతో కొత్త రకం మోసానికి తెరతీసిన నేరగాళ్లు షేర్ మార్కెట్లో అనుభవం ఉన్న వారిని సైతం బురిడీ కొట్టించి అడ్డంగా దోచేస్తున్నారు. వందలాది మందితో పదుల సంఖ్యలో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసిన సైబర్ కేటుగాళ్లు పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యూకే కేంద్రంగా ట్రేడింగ్ జరుపుతున్నట్లు, లక్షల్లో లాభాలు వస్తున్నట్లు చూపిస్తున్నారు. ఆ డబ్బునే ఇతర కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టినట్లు చూపిస్తున్నారు. వాళ్లే ట్రేడింగ్ చేస్తారు. కస్టమర్లకు లాభాలను వర్చువల్‌గా చూపిస్తారు తక్కువ వ్యవధిలోనే రూ.లక్షల్లో లాభాలు వస్తున్నాయన్న భ్రమ కల్పిస్తారు. వారి ఖాతాల్లో అధిక మొత్తంలో డబ్బులు పడగానే స్పందించడం మానేస్తారు.
తీగ లాగుతున్న పోలీసులు..
ట్రేడింగ్‌లో విశేష అనుభవం ఉన్న కేపీహెచ్‌బీకి చెందిన రాజు (పేరు మార్చాం) కూడా సైబర్ నేరగాళ్ల వాట్సప్ గ్రూపులో చేరాడు. కేవలం 15 రోజుల వ్యవధిలో రూ. 60 లక్షలు పోగొట్టుకున్నాడు. భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాక ఆ గ్రూపు స్పందించడం మానేసింది. మోసమని గుర్తించిన రాజు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. రాజు నుంచి టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించిన పోలీసులు తీగ లాగుతున్నారు. రాజును యాడ్ చేసిన వాట్సాప్ గ్రూపులో ఉన్న సభ్యుల వివరాలు ఆరా తీస్తున్నారు. వారంతా నిజంగా కస్టమర్లేనా, లేక డమ్మీలా అనేది తేల్చేపనిలో ఉన్నారు. బాధితుడు పెట్టిన డబ్బులతో నేరగాళ్లు కొనుగోలు చేసిన షేర్లు, పెట్టుబడి పెట్టిన కంపెనీల గురించి విశ్లేషిస్తున్నారు.
అవి నిజంగానే యూకే బేస్డ్ కంపెనీలా, లేక సైబర్ నేరగాళ్లు వాటిని ఉపయోగించుకున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ట్రేడింగ్ దందా వెనుక పెద్ద పెద్ద ముఠాలే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల చేతికి ఈ ముఠా చిక్కితే.. కోట్ల రూపాయల సైబర్ స్కామ్ బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.