ఎవరిదీ పాపం..!

ABN , First Publish Date - 2021-05-02T07:48:49+05:30 IST

అభం, శుభం తెలియని చిన్నారులు విద్యుదాఘాతానికి గురి కావడం తరచూ జరుగుతున్నాయి.

ఎవరిదీ పాపం..!
ప్రమాదానికి కారణమైన ట్రాన్స్‌ఫార్మర్‌

ట్రాన్స్‌ఫార్మర్లతో ప్రాణాలకు ముప్పు

అభం, శుభం తెలియని చిన్నారులు బలి

గ్రేటర్‌లో ట్రాన్స్‌ఫార్మర్లకు కనిపించని రక్షణ

అధికారుల నిర్లక్ష్యం.. సామాన్యులకు శాపం

సూచిక బోర్డులుండవు.. నిబంధనలు పాటించరు

అపార్ట్‌మెంట్లు-ఇరుకు రోడ్లపై ట్రాన్స్‌ఫార్మర్లు

ప్రమాదాలకు కారణమైన అధికారులపై లేని చర్యలు


ఏఎ్‌సరావునగర్‌లోని ఈస్ట్‌ ప్రగతినగర్‌లో సరదాగా ఆడుకుంటూ వెళ్లిన ఎనిమిదేళ్ల బాలుడు నిషాంత్‌ తమ అపార్ట్‌మెంట్‌ పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ తీగ తగిలి తీవ్రగాయాల పాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న కొడుకు పరిస్థితిని వివరిస్తూ ఆ తల్లి మాట్లాడిన వీడియో అందరి హృదయాలను కలచి వేసింది. 

తాజాగా మరో బాలుడు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఆడుకుంటూ ప్రమాదం బారిన పడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 

హైదరాబాద్‌ సిటీ, మే 1 (ఆంధ్రజ్యోతి): అభం, శుభం తెలియని చిన్నారులు విద్యుదాఘాతానికి గురి కావడం తరచూ జరుగుతున్నాయి. అయినా విద్యుత్‌ శాఖ మొద్దు నిద్ర వీడడం లేదు. రోడ్ల పక్కన ఉండే ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాల వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావిడి చేసే అధికారులు అనంతరం మిన్నకుంటున్నారు. ఏఎ్‌సరావునగర్‌లో జరిగిన ఘటనలో ప్రమాదానికి కారణమైన ట్రాన్స్‌ఫార్మర్‌ తమ డిపార్ట్‌మెంట్‌ది కాదు.. అపార్ట్‌మెంట్‌దే అని చెప్పిన అధికారులు తప్పు మాది కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఎవరిదనేది ఇక్కడ విషయం కాదు. నిర్ణీత రుసుము చెల్లిస్తే, ప్రైవేట్‌ వ్యక్తుల అవసరం నిమిత్తం విద్యుత్‌ శాఖ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తుంది. అదే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతా విద్యుత్‌ శాఖదే. సొంత ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద భయానక పరిస్థితి ఉంటేనే పట్టించుకోని అధికారులు, ప్రైవేట్‌ ట్రాన్స్‌ఫార్మర్లను గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి.  

జేబుల్లోకి నిధులు? 

ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ రక్షణ చర్యల కోసం కేటాయించిన నిధులను కొందరు ఇంజనీర్లు జేబులో వేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీఐపీలు ఉండే కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల  చుట్టూ రక్షణ చర్యలు తీసుకుంటూ, బస్తీలు.. కాలనీలలో నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. 

నిధులు మంజూరు చేస్తున్నా.. 

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల రక్షణ కోసం నిధులు కేటాయిస్తున్నా, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. గ్రేటర్‌జోన్‌ పరిధిలో 1.20 లక్షల ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా, 50 శాతం ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణకు కంచెలు ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించవు. ట్రాన్స్‌ఫార్మర్ల పరిసరాల్లో అపాయం(డేంజర్‌) అని తెలిపేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, చాలా చోట్ల అలాంటి బోర్డులు కనిపించవు. బస్తీలలో ట్రాన్స్‌ఫార్మర్లు చేతికి అందే ఎత్తులో ఉంటాయి. అంతేకాకుండా ఒకే ప్రాంతంలో రెండు, మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. సరూర్‌నగర్‌, వనస్థలిపురం, నాంపల్లి, ఆటోనగర్‌, కృష్ణానగర్‌, బోరబండ, మెహిదీపట్నం, బేగంపేట, సోమాజిగూడ, ఖైరతాబాద్‌, ఆబిడ్స్‌ తదితర ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లకు లెక్కకు మించినా విద్యుత్‌కనెక్షన్లున్నాయి.  


ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో నిబంధనలు

8 ఫీట్ల ఎత్తులో ఉండాలి

 చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలి

అపాయం అని సూచించే బోర్డు ఏర్పాటు చేయాలి

 ఫ్యూజ్‌ బాక్స్‌లకు తలుపులు ఉండేలా చూడాలి

ట్రాన్స్‌ఫార్మర్‌ కెపాసిటీ తెలియజేసే బోర్డులుండాలి

ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద తీగలు చేతికి అందేలా ఉండకూడదు 


బాలుడికి కరెంట్‌ షాక్‌ 

మౌలాలి, మే 1 (ఆంధ్రజ్యోతి): ఓ బాలుడు ఆడుకుంటూ ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గరకు వెళ్లగా, షాక్‌ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మౌలాలిలో జరిగింది.  ఎంజే కాలనీలోని సన్‌రైస్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముండే ధనుంజయ శర్మ, సాయి సింధూజలకు బాబు రామ్‌సాయి నైనిష్‌(5), పాప లాలిత్య ఉన్నారు. శుక్రవారం సాయ్రంతం పక్కనే ఉన్న జ్యోతి ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌ ట్రాన్‌ఫార్మర్‌ వద్ద నైనిష్‌ అడుకుంటుండగా, ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌ తగిలింది. కుటుంబ సభ్యులు రామ్‌సాయిని వెంటనే సైనిక్‌పురిలోని ఆస్పత్రికి తరలించారు. 60 శాతం గాయాలయ్యాయని, 48 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు సూచించినట్లు నైనిష్‌ తండ్రి ధనుంజయ శర్మ తెలిపారు. బాబు తండ్రి పురోహితుడు. ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. విషయం తెలిసి కార్పొరేటర్‌ గున్నాల సునీత చంద్రశేఖర్‌ యాదవ్‌ చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. విద్యుత్‌ అధికారులతో మాట్లాడి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎత్తు పెంచాలని సూచించారు.

ఫోన్‌లో ఎమ్మెల్యే పరామర్శ 

ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి పరామర్శించి బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తగిన సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు.



Updated Date - 2021-05-02T07:48:49+05:30 IST