ఉస్మానియాలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్ల టీజింగ్‌లు.. దాడులు

ABN , First Publish Date - 2021-08-21T07:12:03+05:30 IST

ఉస్మానియా ఆస్పత్రిలో కొంతమంది ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లు రెచ్చిపోతున్నారు.

ఉస్మానియాలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్ల టీజింగ్‌లు.. దాడులు

ఇబ్బంది పడుతున్న మహిళలు

అడిగిన వారిపై దౌర్జన్యం

తాజాగా క్యాంటీన్‌లోకి చొరబడి క్యాషియర్‌పై దాడి

అధికారుల పర్యవేక్షణా లోపంతోనే పెట్రేగుతున్న వైనం


మంగళ్‌హాట్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆస్పత్రిలో కొంతమంది ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లు రెచ్చిపోతున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల సహాయకులు, మహిళలను టీజింగ్‌ చేస్తూ వికృతానందాన్ని పొందుతున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు సైతం పాల్పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే వారు ఇలా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని ఆరోపణలున్నాయి. తాజాగా ఆస్పత్రి క్యాంటీన్‌ క్యాషియర్‌పై జరిగిన దాడే ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. 

ఉస్మానియా ఆస్పత్రికి ఎక్కువ శాతం రోగులు జిల్లాల నుంచి వస్తుంటారు.  ఆస్పత్రి ఓపీ గేటు వద్ద అఫ్జల్‌గంజ్‌ ఔట్‌ పోస్ట్‌, పాత భవనం వెనకాల అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇక ఆస్పత్రిలో దాదాపు వంద మందికిపైగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అయినా అనుమతులు లేకుండా ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లు ఆస్పత్రిలోకి ప్రవేశించి ఓపీ ప్రాంగణంలో తిష్ఠ వేస్తుంటారు. గుంపులుగా చేరి ఒకరినొకరు తిట్టుకోవడం, రోగి సహాయకులుగా వచ్చిన మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో పలుమార్లు మందలించే ప్రయత్నం చేయగా తమపై కూడా దాడులకు దిగుతున్నారని వార్డు బాయ్‌లు, ఇతర సిబ్బంది వాపోయారు. ఆస్పత్రి ప్రాంగణంలోని మెడికల్‌ షాపులు, క్యాంటీన్‌, ఎస్‌టీడీ నిర్వాహకులకు డ్రైవర్లు ప్రతి నిత్యం చుక్కలు చూపిస్తున్నారని ఆయా షాపుల్లో పనిచేస్తున్న వారు ఆవేదన చెందుతున్నారు. స్థానికంగా ఉండే యువకులే ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లు కావడంతో వారిపై ఫిర్యాదు చేసేందుకు ఇతరులు వెనుకాడుతున్నట్లు సమాచారం. ఆస్పత్రిలో డ్యూటీ ఆర్‌ఎంఓలు పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి వ్యవహారాలు పోలీసుల వరకు వెళ్లడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


 ఫిర్యాదు చేసినా మారని తీరు...

స్థానికంగా ఉండే యువకులు ప్రైవేట్‌ అంబులెన్స్‌లను ఉస్మానియాలో అక్రమంగా పార్క్‌ చేసి జిల్లాలకు వెళ్లే రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారని కొంత కాలంగా ఫిర్యాదులు రావడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ పలు మార్లు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. అప్పటి నుంచి ఆయన కనిపించిన ప్రతిసారి డ్రైవర్లు బెదిరింపు ధోరణిలో చూస్తున్నారని, అధికారులు, సిబ్బంది విషయంలోను ఇలాగే చేస్తున్నారని సమాచారం.  దీంతో ఆస్పత్రిలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ల పార్కింగ్‌ను నిషేధించడంతో ఉస్మానియా పాత భవనం ప్రహరీకి ఆనుకొని రోడ్డుపై అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు అక్రమ పార్కింగ్‌లు చేస్తున్నారు.  


దురుసుగా ప్రవర్తిస్తున్నారు

ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అనేక సందర్భాల్లో సిబ్బంది కాలర్‌ పట్టుకొని అసభ్య పదజాలంతో దూషించిన ఘటనలు ఉన్నాయి. 

 - అనిల్‌(ఆస్పత్రి సిబ్బంది) 

ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లకు అనుమతి లేదు 

ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లు ఆస్పత్రిలోకి వచ్చేందుకు అ నుమతి లేదు.  ఇలాంటి వ్యవహారాలను సహించేది లేదు.  

- డాక్టర్‌ నాగేందర్‌. సూపరింటెండెంట్‌


క్యాషియర్‌పై దాడి...

ఆస్పత్రి ప్రాంగణంలోని కార్నర్‌ క్యాంటీన్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న నారాయణమూర్తి(53)పై గురువారం రాత్రి 9 గంటల సమయంలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌ గౌస్‌ దాడికి పాల్పడ్డాడు. క్యాంటీన్‌ పక్కనే గుంపుగా కూర్చొని ఉన్న ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లలో గౌస్‌ దౌర్జన్యంగా క్యాంటీన్‌లోకి చొరబడి వాటర్‌ బాటిళ్లు తీసుకున్నాడు. క్యాషియర్‌ నారాయణ మూర్తి తమ క్యాంటీన్‌లోకి మద్యం తాగి రావద్దని, తీసుకున్న వాటర్‌ బాటిళ్లకు డబ్బులు చెల్లించాలని గౌస్‌ను కోరడంతో డబ్బులు ఇచ్చేది లేదంటూ అతనిపై దాడి చేశాడు. కంటిపై కొట్టడంతో కళ్లద్దాలు పగిలి పూర్తి కన్నుకు గాయమైంది. దీంతో వెంటనే  నాలుగడుగుల దూరంలో ఉన్న పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా సిబ్బంది లేకపోవడంతో డయల్‌ 100కు ఫోన్‌ చేశాడు. పోలీసులు క్యాంటీన్‌కు చేరుకొని నారాయణ మూర్తి వద్ద వివరాలు సేకరించారు. అనంతరం గౌస్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు ప్రయత్నించగా అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం ఉదయం నారాయణమూర్తి అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆస్పత్రిలో చికిత్సలు చేయించుకున్నాడు.  క్యాంటీన్‌ క్యాషియర్‌పై దాడికి పాల్పడిన అంబులెన్స్‌ డ్రైవర్‌ పాతబస్తీకి చెందిన గౌస్‌ని శుక్రవారం అఫ్జల్‌గంజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాలస్వామి తెలిపారు.  

Updated Date - 2021-08-21T07:12:03+05:30 IST