తల్వార్‌ కార్స్‌ డైరెక్టర్‌ అరెస్టు

ABN , First Publish Date - 2021-08-10T06:37:42+05:30 IST

నకిలీ పత్రాలతో బ్యాంకులను, ఆర్థిక సంస్థలను మోసం చేసిన తల్వార్‌ కార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ సాకేత్‌ తల్వార్‌ను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.

తల్వార్‌ కార్స్‌ డైరెక్టర్‌ అరెస్టు

నకిలీ పత్రాలతో బ్యాంకులకు టోకరా  

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): నకిలీ పత్రాలతో బ్యాంకులను, ఆర్థిక సంస్థలను మోసం చేసిన తల్వార్‌ కార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ సాకేత్‌ తల్వార్‌ను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. గోవా బీచ్‌లో సేద దీరుతున్న అతడిని సీసీఎస్‌ పోలీసులు పట్టుకుని నగరానికి తరలించారు. నకిలీ పత్రాలు సమర్పించి ఖరీదైన కార్లు కొనుగోలు పేరుతో సుల్తాన్‌ బజార్‌లోని కెనరా బ్యాంకుతోపాటు పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకొని మోసం చేశాడు. తన వద్ద పనిచేస్తున్న వ్యక్తి వివరాలతో ఖరీదైన కార్లు కొనుగోలు చేస్తానంటూ బ్యాంకులను సంప్రదించేవాడు. ఖరీదైన కార్లకు సంబంధించిన నకిలీ ఇన్‌వాయి్‌సలు, ఇన్సూరెన్స్‌ పత్రాలు, టీఆర్‌లు, చాసిస్‌ నంబర్లను సమకూర్చి కార్లు కొనుగోలు చేయకుండానే నకిలీ పత్రాలతో పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడు. ఈ డబ్బును విలాసాలకు ఖర్చుపెట్టేవాడు. అతడిపై బంజారాహిల్స్‌ పోలీస్టేషన్‌లో 3, సీసీఎ్‌సలో 2, పంజాగుట్ట, మియాపూర్‌, జూబ్లీహిల్స్‌లో ఒక్కోకేసు నమోదయ్యాయి. నిందితుడు సాకేత్‌ తల్వార్‌ గోవాలోని ఆరాంబోల్‌ బీచ్‌లో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. ట్రాన్సిట్‌ వారెంట్‌పై నగరానికి తరలించి కోర్టులో హాజరుపరిచారు.

Updated Date - 2021-08-10T06:37:42+05:30 IST