కొడుకును చంపేందుకు యత్నించిన తండ్రి అరెస్టు
ABN , First Publish Date - 2021-01-20T07:13:27+05:30 IST
చదవడం లేదన్న కోపంతో కన్న కొడుకును చంపేందుకు ప్రయత్నించిన కేసులో నిందితుడిని కేపీహెచ్‌బీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

కూకట్‌పల్లి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): చదవడం లేదన్న కోపంతో కన్న కొడుకును చంపేందుకు ప్రయత్నించిన కేసులో నిందితుడిని కేపీహెచ్‌బీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం, జొన్నలవాడ తండాకు చెందిన రత్నావత్ బాలు(50) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. కేపీహెచ్‌బీకాలనీ రెండో రోడ్డులో ప్రభుత్వ పాఠశాల పక్కన గుడిసె నిర్మించుకొని కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. బాలు కూలిపని చేస్తుంటాడు. అతడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో చరణ్(10) అనే కుమారుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. చరణ్ కొద్దిరోజులుగా సక్రమంగా చదవకపోవడంతోపాటు ట్యూషన్‌కు కూడా వెళ్లడంలేదు. కోపోద్రిక్తుడైన బాలు ఈనెల 17వ తేదీ రాత్రి ఇంటికి వెళ్లి టీవీ చూస్తున్న చరణ్‌ను కొట్టాడు. అనంతరం కొడుకును గుడిసెలో నుంచి బయటకు తీసుకొచ్చి చంపేయాలన్న కోపంతో పక్కనే ఉన్న టర్పెంటాయిల్ చరణ్‌పై పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు బాలుని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చారు.
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులు..
కూకట్‌పల్లి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, కోటైకాయం గ్రామానికి చెందిన ముత్యాల అఖిల్(25), విజయవాడ గాంధీనగర్‌కు చెందిన బానోతు తేజా్‌సనాయక్(25) గోకుల్ ప్లాట్స్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిద్దరూ కొంతకాలంగా నగరానికి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వీరికి నిజామాబాద్‌కు చెందిన రామ్‌దాస్ అనే వ్యక్తి గంజాయి సరఫరా చేస్తుంటాడు. ఈనెల 18వ తేదీన కేపీహెచ్‌బీకాలనీ ఆరోఫేజ్‌లో అఖిల్, తేజా్‌సనాయక్ గంజాయి విక్రయించేందుకు కస్టమర్ల కసం వేచి చూస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 700 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రామ్‌దాస్ పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు.