కరోనా కలవరం

ABN , First Publish Date - 2021-03-24T07:03:33+05:30 IST

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో

కరోనా కలవరం
కాచిగూడ రైల్వేస్టేషన్‌ రెండో గేటువద్దవలస కార్మికులరద్దీ

పెరుగుతున్న కేసులు

వారం రోజులుగా విస్తరిస్తున్న వైరస్‌


గ్రేటర్‌పై కరోనా కన్నెర్ర చేస్తోంది. వారం రోజులుగా వైరస్‌ తీవ్రత పెరుగుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వారం రోజుల్లోనే మూడింతలు పెరిగాయి. విద్యా సంస్థల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. 


జీహెచ్‌ఎంసీలో సీఈ మెయింటెన్స్‌ ఆఫీస్‌కు సెలవు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం ఏర్పడింది. పలు విభాగాల్లో పాజిటివ్‌ కేసులు నిర్థారణ కావడంతో అధికారులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. చీఫ్‌ ఇంజనీర్‌ మెయింటెనెన్స్‌ (సీఈ) సెక్షన్‌లో నలుగురికి కరోనా సోకినట్టు తేలింది. ఇద్దరు అసిస్టెంట్‌ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు సోమవారం కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని ఓ అధికారి తెలిపారు. దీంతో సెక్షన్‌లోని ఇతర ఉద్యోగులు ఇళ్లకు వెళ్లారు. అనంతరం ప్రాంగణాన్ని శానిటైజ్‌ చేశారు. మంగళవారం సీఈ మెయింటెనెన్స్‌ సెక్షన్‌కు సెలవు ప్రకటించారు. ఐదో అంతస్తులోని ఆ సెక్షన్‌కు ఎవరూ వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సంస్థలోని ఆర్థిక విభాగంలోనూ పలువురికి కరోనా వచ్చింది. చాలా మంది మాస్క్‌లు ధరించకుండా, శానిటైజ్‌ చేసుకోకుండా, భౌతిక దూరం పాటించకపోవడం వల్ల తమకు ఇబ్బంది అవుతుందేమో అని 50 యేళ్లు దాటిన ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే పౌరులు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఓ మహిళా అధికారిణి ఆవేదన వ్యక్తం చేశారు. 


కూకట్‌పల్లిలో 50 కేసులు 

కూకట్‌పల్లి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి ప్రాంతంలో మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 50 మందికి కరోనా సోకింది. 


కుత్బుల్లాపూర్‌లో 32 

కుత్బుల్లాపూర్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని నాలుగు యూపీహెచ్‌సీలతో పాటు దుండిగల్‌ ఆరోగ్య కేంద్రంతో కలిపి మంగళవారం 387 మందికి నిర్వహించిన పరీక్షల్లో 32 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు మండల వైద్యాధికారి వై. నిర్మల తెలిపారు. షాపూర్‌నగర్‌లో మరో 31 మందికి పాజిటివ్‌ వచ్చింది. 


శేరిలింగంపల్లిలో 30

గచ్చిబౌలి,మార్చి23(ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మంగళవారం 367 మందికి పరీక్షలు చేయగా, 30 మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. 


రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో 20 

రాజేంద్రనగర్‌/హసన్‌నగర్‌, మార్చి23(ఆంధ్రజ్యోతి) : రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం 307 మందికి పరీక్షలు చేయగా, వారిలో 20 మందికి పాజిటివ్‌గా తేలింది. 


మెహిదీపట్నంలో 23

లంగర్‌హౌజ్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): మెహిదీపట్నం సరోజినీదేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో, గోల్కొండ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షల కోసం ప్రజలు పెద్దఎత్తున వస్తున్నారు. సోమవారం 62 మందిని పరీక్షించగా 18 మంది పాజిటివ్‌ వచ్చింది. మంగళవారం 84 మంది పరీక్షలు చేయగా 23 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. 


లాక్‌డౌన్‌ భయంతో సొంతూళ్లకు 

బర్కత్‌పుర, మార్చి 23(ఆంధ్రజ్యోతి) : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే భయంతో కొందరు వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. గతేడాదిలో లాక్‌డౌన్‌ వల్ల వలస కార్మికులు అష్టకష్టాలు పడ్డ విషయం తెలిసిందే. పరిస్థితులు సద్దుమణిగాక కార్మికులు వివిధ రాష్ర్టాల నుంచి నగరానికి తిరిగి వచ్చారు. ఇటీవల మళ్లీ లాక్‌డౌన్‌ వదంతులు వ్యాపిస్తుండడంతో తట్టాబుట్ట సర్దుకొని కొందరు వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి ఇతర రాష్ర్టాలకు వెళ్లే స్పెషల్‌రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. 


Updated Date - 2021-03-24T07:03:33+05:30 IST