ట్రాన్స్‌ఫార్మర్లలోCopper coils చోరీ

ABN , First Publish Date - 2021-10-14T17:25:40+05:30 IST

నగర శివారు ప్రాంతాల్లోని రైతుల పొలాలు, ఇతర ప్రాంతాల్లోని ట్రాన్స్‌ఫార్మర్‌లను లక్ష్యంగా చేసుకొని.. కాపర్‌ కాయిల్స్‌ను చోరీ చేస్తున్న ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు...

ట్రాన్స్‌ఫార్మర్లలోCopper coils చోరీ

యూపీకి చెందిన ఇద్దరి అరెస్ట్‌ 

25.06లక్షల సొత్తు స్వాధీనం 


హైదరాబాద్‌ సిటీ: నగర శివారు ప్రాంతాల్లోని రైతుల పొలాలు, ఇతర ప్రాంతాల్లోని ట్రాన్స్‌ఫార్మర్‌లను లక్ష్యంగా చేసుకొని.. కాపర్‌ కాయిల్స్‌ను చోరీ చేస్తున్న ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌, కందుకూరు పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించి యూపీకి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.18.60లక్షల నగదు, 160 కేజీల కాపర్‌ కాయిల్స్‌, ఒక ప్రొజెక్టర్‌, నాలుగు బైక్‌లు, టాటా ఇండికా కారు సహా రూ. 25.06లక్షల విలువగల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్‌లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేష్‌ భగవత్‌ బుధవారం వివరాలు వెల్లడించారు. 

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన నందూలాల్‌ రాజ్‌బార్‌ 20 ఏళ్ల క్రితం (15 ఏళ్లు వయసులో) నగరానికి వచ్చాడు. నాచారంలోని ఇండస్ట్రీయల్‌ ఏరియాలో ఒక ప్రైవేట్‌ కంపెనీలో గ్యాస్‌ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఆదాయం సరిపోక పోవడంతో ఇద్దరు స్నేహితులతో కలిసి ఇళ్లలో దొంగతనాలు చేస్తూ నాచారం పోలీసులకు చిక్కి 2012లో జైలుకెళ్లారు. నందూలాల్‌ రాజ్‌బార్‌ స్నేహితుడు అభిమన్యు రాజ్‌బార్‌ 2014లో యూపీ నుంచి నగరానికి వచ్చాడు. ముఠాలో యూపీకి చెందిన సహదేవ్‌, రాహుల్‌ రాజ్‌బార్‌లను కలుపుకొని చోరీ చేయాలని ప్లాన్‌ చేశారు.


నగర శివారు ప్రాంతాలైన రాచకొండ, సైబరాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి ప్రాంతాల్లో రెండు బైక్‌లపై పగలంతా తిరిగేవారు. పొలాలతోపాటు నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లను రెక్కీ చేసేవారు. అర్థరాత్రి దాటిన తర్వాత నలుగురు కలిసి స్పాట్‌కు వెళ్తారు. ఇద్దరు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లి కర్రతో పవర్‌ను ఆఫ్‌ చేస్తారు. మిగిలిన ఇద్దరు కాపలాగా ఉంటారు. ట్రాన్స్‌ఫార్మర్‌లోని ఖరీదైన కాపర్‌ కాయిల్స్‌తో పాటు.. విలువైన పరికరాలు తస్కరించి అక్కడి నుంచి ఉడాయిస్తారు. ఇలా మొత్తం 77 చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.


రాచకొండలో 28, సైబరాబాద్‌- 03, వికారాబాద్‌ -42, సంగారెడ్డిలో-04రాచకొండ శివారు ప్రాంతాలైన యాచారం, కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో వరుసగా ట్రాన్స్‌ఫార్మర్‌లలో కాపర్‌ కాయిల్స్‌ చోరీ అవుతున్నాయని పోలీసులుకు ఫిర్యాదులు అందాయి. దాంతో సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాల మేరకు ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు రంగంలోకి దిగారు. కందుకూరు పోలీసులతో కలిసి ముఠాలోని నందూలాల్‌ రాజ్‌బార్‌, అభిమన్యురాజ్‌ బార్‌లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల ఆటకట్టించిన సీసీఎస్‌ టీమ్‌, కందుకూరు పోలీసులను క్రైమ్స్‌ డీసీపీ యాదగిరి, ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి, క్రైమ్స్‌ ఏసీపీ శంకర్‌రెడ్డిలను సీపీ అభినందించి రివార్డులు అందజేశారు. 

Updated Date - 2021-10-14T17:25:40+05:30 IST