జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ధిక్కార నోటీసులు
ABN , First Publish Date - 2021-05-20T16:08:15+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున జూన్ 30వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని ఫుల్‌కోర్టు ధర్మాసనం స్పష్టమైన

4 వారాల్లోగా బదులివ్వాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున జూన్ 30వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని ఫుల్‌కోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీచేసినప్పటికీ....జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అధికారుల చర్య కోర్టు ధిక్కారమే అవుతుందని స్పష్టం చేసిన న్యాయమూర్తి... జీహెచ్‌ఎంసీ కమిషనర్, లోయర్ ట్యాంక్‌బండ్ జోనల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులిచ్చింది. కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు చేపట్టరాదో వివరణ ఇవ్వాలని వారిని కోరింది. ఈ మేరకు జస్టిస్ టి. వినోద్‌కుమార్ ఇటీవల ఆదేశాలు జారీచేశారు. సికింద్రాబాద్, తుకారంగేట్‌లోని తమ ఇంటిని కూల్చివేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారని, వారిని నిరోధించాలని కోరుతూ ఎస్. సూర్యభాన్, అశోక్ కుమార్ సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. తమ ఆస్తులను సేకరించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ భూసేకరణకు పూనుకుని కూల్చివేతలకు సిద్ధపడుతున్నారని పిటిషనర్ల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నందున జూన్ 30వరకు రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎవరినీ ఖాళీ చేయించవద్దని, ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దంటూ ఫుల్‌కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని కోర్టుకు తెలిపారు.