కార్పొరేటర్‌పై దురుసుగా ప్రవర్తించిన తహసీల్దార్
ABN , First Publish Date - 2021-01-20T07:17:49+05:30 IST
షేక్‌షేట మండల తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిపై బంజారాహిల్స్ డివిజన్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ సిటీ/బంజారా హిల్స్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): షేక్‌షేట మండల తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిపై బంజారాహిల్స్ డివిజన్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజాసమస్యల పరిష్కార నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా.. మహిళా కార్పొరేటర్ అని చూడకుండా దాడికి యత్నించడంతోపాటు దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదాయ ధ్రువీకరణ పత్రాల విషయంలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తహసీల్దార్ శ్రీనివా్‌సరెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు కార్పొరేటర్ ఫోన్ ద్వారా సంప్రదించారు. ఫోన్‌లో తహసీల్దార్ ఆమెతో అమర్యాదగా మాట్లాడుతూ... పని ఉంటే తన కార్యాలయానికి వచ్చి మాట్లాడాలంటూ ఫోన్ కట్ చేసినట్లు కార్పొరేటర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కార్పొరేటర్ స్థానికులతో కలిసి షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. తహసీల్దార్ భోజనం చేస్తుండటంతో బయట వేచి ఉన్నారు. అదే సమయంలో బయటకు వచ్చిన తహసీల్దార్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటమే కాకుండా తనపై దాడికి యత్నిస్తూ దుర్భాషలాడారని అన్నారు. తహసీల్దార్ శ్రీనివా్‌సరెడ్డితోపాటు డిప్యూటీ తహసీల్దార్ ఆంఽథోనీ కూడా దాడికి యత్నించారని ఆమె పేర్కొన్నారు. ఎవరికి చెబుతారో చెప్పుకోండి అంటూ బెదిరించారన్నారు. కార్పొరేటర్ నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు న్యాయ సలహా తీసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. తహసీల్దార్ అభ్యంతరకర శైలి గురించి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి దృష్టికి కూడా తీసుకెళ్లానని, విచారించి చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారని కార్పొరేటర్ విజయలక్ష్మి తెలిపారు.