థాయిలాండ్‌లో ఉద్యోగాల పేరుతో మోసం
ABN , First Publish Date - 2021-02-01T06:35:56+05:30 IST
థాయిలాండ్ దేశంలోని హోటళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన

లక్షల్లో వసూలు చేసిన కన్సల్టెన్సీ
హిమాయత్‌నగర్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): థాయిలాండ్ దేశంలోని హోటళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ఓ కన్సల్టెన్సీ నిర్వాహకులను నారాయణగూడ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. కిరణ్ పందిరి, షేక్ మీర్ మహ్మద్ ముసాయుద్దీన్‌లు ఓ జాబ్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నారు. హిమాయత్‌నగర్‌లోని ఎల్‌ఎల్‌పీ మహావీర్ భవనంలో ఈ కన్సల్టెన్సీ కొనసాగుతోంది. నిందితులు థాయిలాండ్‌లోని హోటల్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ న్యూస్ పేపర్లలో, సోషల్‌మీడియాలో ప్రకటనలు చేయడంతో వాటిని చూసి ఆకర్షితులైన పలు జిల్లాలకు చెందిన యువకులు కన్సల్టెన్సీ నిర్వాహకులను సంప్రదించారు.
ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చుల పేరుతో ఒక్కో యువకుడి నుంచిరూ.లక్షా ముప్పైవేలకు పైగానే కన్సల్టెన్సీ నిర్వాహకులు వసూలు చేశారు. డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా వారి నుంచిస్పందన లేకపోవడంతో బాధిత యువకులు ఇటీవల నారాయణగూడ పోలీసులను ఆశ్రయించారు. పదిరోజులుగా సమస్యను పరిష్కరించుకుంటామంటూ నమ్మబలికిన కన్సల్టెన్సీ నిర్వాహకులు మాయమాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో బాధిత యువకులు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో నాలుగు రోజుల క్రితం కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం నిందితులు కిరణ్ పందిరి, షేక్ మీర్ మహ్మద్ ముసాయిద్దీన్‌లను అరెస్టు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు.
ఎస్సై నాగరాజు తెలిపిన ప్రకారం.. కన్సల్టెన్సీ నిందితులు వివిధజిల్లాలకు చెందిన వంద మందికి పైగా యువకులు ఉన్నారని తెలుస్తోంది. జగిత్యాల, కరీంనగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన యువకులే ఇందులో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.