నిత్యావసరాలు అధిక ధరకు విక్రయిస్తున్న నాలుగు దుకాణాలపై కేసు
ABN , First Publish Date - 2021-05-21T07:13:16+05:30 IST
లాక్‌డౌన్ సమయంలో నిత్యావసరాలు అధిక ధరకు విక్రయిస్తున్న వ్యాపారులకు కళ్లెం వేసేందుకు సివిల్ సప్లై, లీగల్ మెట్రాలజీ, డ్రగ్ కంట్రోల్, ఫుడ్ ఇన్‌స్పెక్షన్ ప్రత్యేక బృందాలు పోలీసులతో కలిసి పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

హైదరాబాద్ సిటీ, మే 20 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్ సమయంలో నిత్యావసరాలు అధిక ధరకు విక్రయిస్తున్న వ్యాపారులకు కళ్లెం వేసేందుకు సివిల్ సప్లై, లీగల్ మెట్రాలజీ, డ్రగ్ కంట్రోల్, ఫుడ్ ఇన్‌స్పెక్షన్ ప్రత్యేక బృందాలు పోలీసులతో కలిసి పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. గురువారం మూసారాంబాగ్, మలక్‌పేట, ఖాదర్‌బాగ్, నానల్‌నగర్, ఆబిడ్స్, జేఎన్‌రోడ్, కింగ్‌కోఠి, నాంపల్లి, శిఖ్‌విలేజ్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లోని సూపర్ మార్కెట్లు, హోటళ్లు, మెడికల్ షాపులు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, కూరగాయల మార్కెట్లు, చికెన్ సెంటర్లు, స్వీట్ షాపులు, కిరాణా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. అధిక ధరకు నిత్యావసరాలు విక్రయిస్తున్న 4 దుకాణాలపై కేసులు నమోదు చేసి రూ. 5వేల జరిమానా విధించారు. వారం రోజుల నుంచి 187 వ్యాపార సముదాయాల్లో తనిఖీలు నిర్వహించి 48 కేసులు నమోదు చేసి, రూ. 1.69 లక్షలు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.