boy kidnapped కథ సుఖాంతం
ABN , First Publish Date - 2021-10-20T17:23:11+05:30 IST
మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గంటల వ్యవధిలోనే బాలుడిని సురక్షితంగా

తల్లిదండ్రుల చెంతకుచేర్చిన పోలీసులు
హైదరాబాద్/మదీన: మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గంటల వ్యవధిలోనే బాలుడిని సురక్షితంగా దక్షిణ మండలం డీసీపీ గజారావు భూపాల్ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. బండ్లగూడ రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన మహ్మద్ నసీర్, ఆయన భార్య రోజు మాదిరిగానే సోమవారం పనికి వెళ్లిపోయారు. ఇంట్లో ఆరేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు మహ్మద్ అహ్మద్ ఉన్నారు. మధ్యాహ్నం మహ్మద్‌అహ్మద్ ఇంటి ముందు ఆడుకుంటూ, కనిపించకుండా పోయాడు. బాలిక తమ్ముడు కనిపించడంలేదంటూ తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పింది. వారు వచ్చి వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదుచేశారు. సీఐ కె.ఎన్.ప్రసాద్‌వర్మ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించగా బాలుడిని ఓ మహిళ తీసుకెళ్తున్నట్లుగా కనిపించింది.
పక్కింటి మహిళే కిడ్నాపర్
బాలుడి ఇంటి పక్కన నివసించే ఫాతిమాబేగం అలియాస్ బీబీ(38) చిన్నారిని తీసుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. చిన్నారిని హసన్‌నగర్‌లోని మదీన మసీదు ప్రాంతంలో సయ్యద్ గౌసియా బేగం అలియాస్ ఆసియా(39) వద్ద ఉన్నట్లుగా గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో గౌసియా బేగం ఇంటికి వెళ్లి బాలుడిని తమ అధీనంలోకి తీసుకున్నారు. విచారించగా మగ సంతానం లేని తమ బంధువులకు ఇవ్వాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. కాగా, ఫాతిమా బేగం, సయ్యద గౌసియా బేగంలు దూరపు బంధువులు. గౌసియా బేగంకు మగ సంతానం లేకపోవడంతో పెంచుకోవడానికి ఒక అబ్బాయి కావాలని కొద్దిరోజు ల క్రితం ఫాతిమా బేగంకు చెప్పింది. దీంతో అదను చూసిన ఫాతిమాబేగం బాలుడిని కిడ్నాప్ చేసి, ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లి గౌసియా బేగంకు అప్పగించింది. కేసును ఛేదించిన చాంద్రాయణగుట్ట పోలీసులను డీసీపీ అభినందించారు.