బంజారాహిల్స్‌లో భారీగా నల్లధనం మార్పిడి
ABN , First Publish Date - 2021-05-21T13:52:54+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లోకూడా అనేక అవకతవకలకు పాల్పడినట్లు...

- మూతబడిన సంస్థల పేరుతో బ్యాంక్ ఖాతాలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయవాది
హైదరాబాద్/బంజారాహిల్స్ : పనిచేయని వ్యాపార సంస్థల పేరుతో బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్న వ్యాపారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ న్యాయవాది బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో నివసించే వ్యాపారి ప్రమోద్‌కుమార్ పచ్వా పలు బ్యాంకుల్లో అనేక వ్యాపార సంస్థల పేరుతో ఖాతాలు నిర్వహించి నల్లధనాన్ని మార్చుతున్నాడని పిల్లా రామలింగేశ్వరరావు అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు.
బ్యాంకు అధికారుల సాయంతో మూతబడిన సంస్థల పేరుతో ఖాతాలు నిర్వహిస్తూ వాటి ద్వారా నల్లధనాన్ని మార్చుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడని నగర కమిషనర్‌కు, బంజారాహిల్స్ ఇన్పెక్టర్‌కు, సీఐడీ విభాగం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్‌లోకూడా అనేక అవకతవకలకు పాల్పడినట్లు తమ దృష్టికి రావడంతో ఏపీ ముఖ్యమంత్రితోపాటు అక్కడి ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ ప్రారంభించారు.