బైపాప్ వెంటిలేటర్లను విరాళంగా ఇచ్చిన ట్రాన్సాసియా
ABN , First Publish Date - 2021-05-24T16:48:09+05:30 IST
తెలంగాణ ప్రభుత్వానికి ప్రముఖ ఐవీడీ ప్లేయర్ ట్రాన్సాసియా బయో మెడికల్స్ లిమిటెడ్ ఐదు బైపాప్ వెంటిలేటర్ యంత్రాలను విరాళంగా అందించింది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ప్రముఖ ఐవీడీ ప్లేయర్ ట్రాన్సాసియా బయో మెడికల్స్ లిమిటెడ్ ఐదు బైపాప్ వెంటిలేటర్ యంత్రాలను విరాళంగా అందించింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతంగా కోవిడ్–19 రోగులను గుర్తించి, చికిత్సనందించేందుకు ట్రాన్సిసియా సాయమందిస్తోంది. అందులో భాగంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి 5 బైపాప్ వెంటిలేటర్లను అందజేసింది. వీటిని కోవిడ్ చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులకు అందించనున్నారు. ఈ మెషీన్ల లభ్యత ప్రస్తుతం తక్కువగా ఉండటంతో ట్రాన్సాసియా ఈ మెషీన్లను తమ అంతర్జాతీయ వెండార్ల నుంచి కొనుగోలు చేసి సమకూర్చుకుంది. ట్రాన్సాసియా బయో మెడికల్స్ లిమిటెడ్ జోనల్ మేనేజర్ ఎన్‌ఎస్ మురళీధర్.. తెలంగాణా రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) జనరల్ మేనేజర్ డాక్టర్ వీ రాంబాబు నాయక్‌కు ఈ యంత్రాలను అందించారు.