సమయానికి రారు.. అందుబాటులో ఉండరు!

ABN , First Publish Date - 2021-12-30T17:40:48+05:30 IST

తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్‌) ప్రధాన కార్యాలయానికి..

సమయానికి రారు.. అందుబాటులో ఉండరు!

  • సెంట్రల్‌ సర్కిల్‌ సిబ్బంది తీరుపై విమర్శలు
  • మధ్యాహ్నం 12 గంటల తర్వాతే విధులకు..
  •  

హైదరాబాద్‌ సిటీ : తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్‌) ప్రధాన కార్యాలయానికి సమీపంలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఉదయం 10.30కు కార్యాలయానికి రావాల్సి ఉండగా ఒక్కరూ అందుబాటులో ఉండడం లేదు. పరిపాలన, టెక్నికల్‌, అకౌంట్స్‌ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు డీఈ, ఏడీఈ, ఏఈలు సైతం మధ్యాహ్నం 12 గంటల తర్వాతే కార్యాలయానికి వస్తున్నారు. వీరిని కలిసేందుకు పలు ప్రాంతాల నుంచి వచ్చిన వినియోగదారులు గంటల కొద్దీ వేచి ఉంటున్నారు. సిబ్బంది కోసం హాజరు పట్టీ నిర్వహిస్తున్నా ఏ సమయానికి వస్తున్నారో అందులో రాయడం లేదు. సెంట్రల్‌ సర్కిల్‌ ఎస్‌ఈ కార్యాలయం సైతం ఇక్కడే ఉన్నా అధికారులు, సిబ్బంది మాత్రం తమకేమీ భయం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవ హరిస్తున్నారే తప్ప వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదు. కొంతమంది డీఈ, ఏడీఈ, ఏఈ స్థాయి అధికారులు కార్యాలయాలకు రాకుండానే ఫీల్డ్‌ వర్క్‌ పేరుతో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారు. 


బయో మెట్రిక్‌ విధానంతో మేలు...!

హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌లో 5.87 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు, 3 ఆపరేషన్‌ డివిజన్లు, 9 సబ్‌ డివిజన్లు, 28 సెక్షన్లు ఉన్నాయి. సర్కిల్‌లో 549 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నా బయోమెట్రిక్‌ విధానం అందుబాటులో లేదు. దీంతో కొంతమంది సిబ్బంది రెండు రోజులకు ఒకసారి కార్యాలయాలకు వస్తూ రికార్డుల్లో మాత్రం రోజూ వస్తున్నట్లు చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రేటర్‌ జోన్‌ పరిధిలోని 9 సర్కిల్‌ కార్యాలయాలతో పాటు ప్రతి విద్యుత్‌ డివిజన్‌, సెక్షన్‌ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ విధానం అందుబాటులోకి వస్తే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులంటున్నారు.

Updated Date - 2021-12-30T17:40:48+05:30 IST