ఈ ఒక్కటి చేస్తే కరోనా టైమ్‌లో హ్యాపీగా ఉండొచ్చు...

ABN , First Publish Date - 2021-05-08T13:29:39+05:30 IST

కొవిడ్‌... ఎంతోమందిని ఎన్నో రకాలుగా వేధించింది..

ఈ ఒక్కటి చేస్తే కరోనా టైమ్‌లో హ్యాపీగా ఉండొచ్చు...

కొవిడ్‌... ఎంతోమందిని ఎన్నో రకాలుగా వేధించింది.. వేధిస్తోంది. గత ఏడాదికాలంగా ఆనందం స్థానంలో భయమే ఎక్కువ మందిని ఆవహించింది. స్నేహితులను కలుసుకోవడం లేదు.. కుటుంబ సభ్యుల నడుమ ఆప్యాయతలూ లేవు. కనిపించని శత్రువు ఎటునుంచి దాడి చేస్తుందో తెలియక సతమతమవుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇక సంతోషం ఎక్కడుంటుంది అంటే... ఆశావహ జీవితంతో ఉన్నవారి నడుమ సంతోషమూ అదే రీతిలో ఉంటుందంటున్నాయి అధ్యయనాలు. ఇండియా హ్యాపీనెస్‌ రిపోర్ట్‌ 2020లో టియర్‌ 1 నగరాల సరసన స్థానం సంపాదించుకున్న హైదరాబాద్‌లో సంతోషం ఏ విధంగా ఉందని అంటే... ‘కొవిడ్‌-19 ప్రభావం బాగానే ఉంది కానీ తమను తాము తెలుసుకునే ప్రయత్నం చేశామని కొందరు.. ఆశావహ ధృక్పథంతో ముందుకు వెళ్తున్నామంటున్నారు’ మరికొందరు. ఎవరెవరు ఏమంటున్నారంటే...


వైద్యుల మానసిక స్థితిని అర్థం చేసుకోండి

కొవిడ్‌ ఎంతోమందికి ఎన్నో రకాల అనుభవాలను అందించింది. మరీ ముఖ్యంగా మా లాంటి వైద్యులకు ఆనందాన్ని, ఆవేదనను, ఆరాటాన్ని, బాధను... ఒకటేమిటి అన్ని రకాల మనోభావాలనూ కలిగించిందనే చెప్పాలి. ఎందరో రోగులకు చికిత్స చేయగలిగామన్న ఆనందం ఓ వైపు అయితే, అందరికీ కాపాడలేకపోయామనే బాధ ఇంకోవైపు, ఇది చాలదన్నట్లు ఇంట్లో పిల్లలను సైతం దూరం పెట్టిన రోజుల్లో కలిగిన ఆవేదన.. రోగుల కుటుంబ సభ్యులు చూపే ఆరాటం, అసలు ఈ ఏడాదికాలం మరిచిపోలేము. తమకు తెలిసిన చికిత్స చేసిన తరువాత తగ్గింది అని రోగులు చెప్పినప్పుడు పొందే ఆనందం కన్నా, కష్టమైనా సరే మీరే ఏదో ఒకటి చేయండి డాక్టర్‌ అని అంటే మాలో కలిగే భయం, బాధ బయట పడకుండా పర్లేదు, అంటూ వారికి ధైర్యం కలిగిస్తూనే, మాకు మేము మనోధైర్యం కలిగించుకోవడం... ఎన్నని చెప్పగలం. ఇప్పుడు కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. దయచేసి ఈ కష్టకాలంలో బాధ్యతగా ప్రవర్తించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. - డాక్టర్‌ ప్రతిభా లక్ష్మి, ఎండీ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఉస్మానియా ఆస్పత్రి


వ్యాక్సినేషన్‌తో సానుకూలమనిపిస్తోంది..

కొవిడ్‌ మన కుటుంబ బంధాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది నాపై వ్యక్తిగతంగా మాత్రమే కాదు వృత్తిపరంగా కూడా ప్రభావం చూపింది. ఈ కొవిడ్‌ కాలంలో మా దగ్గర వారిని కలుసుకునే అవకాశం లేకపోయింది. అలాగే ఎలాంటి కార్యక్రమాలూ చేయలేకపోయాను. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం కావడంతో ఇప్పుడు సానుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదైనా సాధించగలమన్న ఆశ, కొవిడ్‌ను ధైర్యంగా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు దేశంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు మరలా గత ఏడాదిని కళ్ల ముందు తీసుకువస్తున్నాయి. - ఎన్‌ఎస్ఎల్‌ ప్రవీణ, కొరియోగ్రాఫర్‌


నన్ను నేను తెలుసుకునేందుకు  తోడ్పడింది..

నాకు వృత్తిపరంగా మాత్రం గణనీయమైన మార్పులే వచ్చాయి. నేను బ్యాంకింగ్‌ రంగంలో చేస్తాను.  గత ఏడాది నవంబర్‌లో కొవిడ్‌ బారిన పడటంతో నా జీవితం గురించి నేను పునరాలోచించడం మొదలుపెట్టాను. జీతం తప్ప నాకు వృత్తిపరంగా ఏమి లభిస్తుందని ఆలోచిస్తే నేనేమి కోల్పోయానో, కోల్పోతున్నానో కూడా తెలుసుకునేలా చేసింది. రోజూ ఆఫీసులో 13-14 గంటలు కష్టపడుతున్నా మనకు వస్తున్నది జీతం మాత్రమే. అంతకు మించి ఏమైనా ఉందా అని అంటే... ఏమీ లేదనే సమాధానం ఎదురవుతోంది. ఆ కష్టమేదో నా గురించి నేను కష్టపడితే... అనే ప్రశ్న వేసుకున్నాను. ఎందుకంటే.. ఆర్గనైజేషన్లు ఎప్పుడూ కూడా మనం ఎంత విశ్వాసంగా ఉన్నాం, ఎంత కష్టపడుతున్నామన్నది చూడవు. వీడివల్ల మనకు పెద్దగా ఉపయోగం లేదు, వీడి కన్నా తక్కువ జీతంలో ఇంకొకడు దొరుకుతాడని అనుకుంటే నిర్ధాక్ష్యిణ్యంగా ఉద్యోగంలోంచి తీసేస్తాయి. కరోనా నాకు నేర్పిన చక్కటి పాఠమిది. - డానియేల్‌ సూరిశెట్టి, అసిస్టెంట్‌ మేనేజర్‌, బ్యాంకింగ్‌ సెక్టార్‌


పనిభారం పెరిగింది..

కొవిడ్‌ ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనా లేని సమయంలో అందరూ ఆఫీసులకు, పిల్లలు స్కూల్స్‌, కాలేజీలకు వెళ్లేవారు. మా లాంటి గృహిణిలు కాస్త రిలాక్స్‌ అయ్యేవాళ్లం. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉండటం వల్ల పనిభారం పెరిగింది. గత ఏడాది కాలంగా జీవితం భయంగానే గడుస్తోంది. ఎక్కడికి వెళ్లాలన్నా భయమే. ఆఖరకు పక్కింటి వాళ్లతో మాట్లాడాలన్నా భయంగానే ఉంటోంది. కరోనా ఇప్పుడు జీవితాల్లో ఆనందం మాయం చేసి ఆందోళనను తీసుకువచ్చింది. - శ్యామల, గృహిణి


సీరియస్‌గా తీసుకోవాలి

కరోనా పట్ల విద్యార్థులకు అవగాహన ఇప్పటికీ పెద్దగా లేదు. అందరికీ ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ ఉండవుగా! ఈ దిశగా ప్రభుత్వం పేద, మధ్య తరగతి విద్యార్థులకు సహాయపడేలా చర్యలు తీసుకుంటే బాగుండేది. ఇప్పటికే ఒక సంవత్సరం వృథా అయింది. ఈ పరిస్థితులు ఎప్పటికి మారతాయో కూడా తెలీదు. అలాగని ప్రాణాలను ఫణంగా పెట్టమనడం కూడా కరెక్ట్‌ కాదు. క్లాస్‌రూమ్‌కు సబ్‌స్టిట్యూట్‌ ఆన్‌లైన్‌ కాదు కానీ, ఆన్‌లైన్‌ తరగతులనే కాస్త సీరియ్‌సగా తీసుకుంటే బాగుంటుంది. - బి. సుజనకుమార్‌, సివిల్స్‌ విద్యార్ధి

Updated Date - 2021-05-08T13:29:39+05:30 IST