మామిడి పండ్లు ఎగబడి కొనేస్తున్నారా.. ఒక్కసారి ఆలోచించండి..!
ABN , First Publish Date - 2021-05-08T13:52:20+05:30 IST
వేసవిలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ మామిడి పండ్లను ఇష్టంగా తింటుంటారు.

- కార్బైడ్ పోయే.. ఇథలిన్ వచ్చే..
- రూట్ మార్చిన వ్యాపారులు..
- విషంగా మారుతున్న మామిడి పండ్లు
హైదరాబాద్/దిల్సుఖ్నగర్ : వేసవిలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ మామిడి పండ్లను ఇష్టంగా తింటుంటారు. వివిధ ప్రాంతాల నుంచి గడ్డిఅన్నారం మార్కెట్‌కు వచ్చే రకరకాల మామిడి పండ్ల రుచులను చూసేందుకు మామిడి ప్రియులు తరలివస్తుంటారు. ఇలా ఈ సీజన్ కోసం ఎదురు చూసే వారికి ఈ ఏడాది కూడా చేదు రుచి చూడక తప్పడం లేదు. కాలుష్య కార్బైడ్‌ను పూర్తి స్థాయిలో నిషేధించాలని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మామిడి ప్రియులు సంబరపడ్డారు. అయితే వ్యాపారులు రూట్ మార్చారు. కార్బైడ్‌కు బదులుగా మరో రసాయన పౌడర్ బాట పట్టారు. సహజసిద్ధంగా కాకుండా కృత్రిమ పద్ధతికి అలవాటు పడిన వ్యాపారులు డబ్బే ధ్యేయంగా త్వరితగతిన పండ్లను మగ్గించేందుకు ఇథలిన్ పౌడర్‌ను వినియోగిస్తున్నారు. కాలుష్య కారకమైన పౌడర్ అని తెలిసికూడా యథేచ్ఛగా కాయలను పండ్లుగా మగ్గిస్తూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
కోర్టు ఉత్తర్వులు బేఖాతర్..
ఆరోగ్యానికి హాని చేకూర్చే రసాయనాలను, రసాయన పౌడర్లను వినియోగించి పండ్లను మగ్గించరాదని గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కొన్నిరోజులు మార్కెట్లలో హడావిడి చేసిన అధికారులు ఆ తర్వాత తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోయారు. వ్యాపారుల ప్రలోభాలకు తలొగ్గిన అధికారగణం వ్యాపారులు యథేచ్ఛగా రసాయన పౌడర్లను వినియోగిస్తున్నా చేష్టలుడిగి చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఇథలిన్ పౌడర్ దిగుమతి...
కాలుష్య కార్బైడ్‌కు ప్రత్యామ్నయంగా ఇథలిన్ పౌడర్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. ఇథలిన్ పౌడర్ వాడకంపై అనుమతి లేకపోయినప్పటికీ కాయలను 24 గంటల్లో నిఘనిఘలాడే పండ్లుగా మార్చేందుకు పౌడర్‌ను దొడ్డిదారిన వినియోగిస్తున్నారు. ఇథలిన్ పౌడర్‌ను 5 ఎంఎల్ ప్యాకెట్లుగా తయారు చేసి, ఒక్కో బాక్స్(15 నుంచి 35 కిలోల మామిడికాయల పెట్టె)లో మూడు నుంచి ఐదు ప్యాకెట్లు వేస్తున్నారు.

ఇథిలిన్ వినియోగం తీరు
5 ఎంఎల్ పౌడర్ ప్యాకెట్లను నీటి గ్లాసులో ఓ ఐదు సెకన్లపాటు ముంచి(నానబెట్టి) కాయల బాక్స్‌లో వేసి మీదనుంచి పేపర్లు చుట్టి, ప్యాకింగ్ చేస్తారు. నీళ్లు తాకగానే ఇథలిన్ పౌడర్‌లో నుంచి వేడివాయువులు వెలువడతాయి. వేడి తీవ్రత అధికంగా ఉండడం మూలంగా గంటల్లోనే కాయలు పండ్లుగా మారుతాయి.
అలా అయితే.. విషపూరితమే
అయితే ప్రకృతి సిద్ధంగా మామిడి కాయలను చెట్టుపైనే పక్వానికి వచ్చే వరకు ఉంచినట్లుయితే సహజ సిద్ధమైన తీపిగా ఉంటాయి. కానీ, నేటి పరిస్థితుల్లో పక్వానికి రాకుండానే చెట్టు నుంచి తెంచి మార్కెట్‌కు తరలిస్తున్నారు. మామిడి కాయల రుచిలో తేడాలు వస్తున్నాయి. గతంలో మామిడి కాయలుగా సహజసిద్ధంగా బట్టీలలో పక్వానికి తేచ్చే పద్ధతులు పాటించేవారు. దీని వల్ల రుచిలో ఎలాంటి తేడా లేకుండా మామిడి మధుర తీపిని ప్రజలు రుచి చూసేవారు. కానీ, నేడు బట్టీల ద్వారా కాకుండా రసాయనాలతో కృతిమ పద్ధతులు అవలంభించడం ద్వారా అవి విషపూరితంగా మారుతున్నాయి. ఈ క్రమంలో మామిడి పండ్లు పసుపురంగులో నిగనిగలాడుతు కనిపించినా రసాయన ప్రభావంతో సహజత్వాన్ని కోల్పోతున్నాయి. కృత్తిమ పద్ధతిలో రసాయనాల ద్వారా మగ్గించిన పండ్లను తినడం మూలంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సహజ పద్ధతిలో నాలుగు రోజులు.. రసాయనాలతో 48 గంటల్లోనే..!
మామిడి కాయలను సహజసిద్ధంగా గడ్డిలో పెట్టి మగ్గించాలి. నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద పండును మగ్గించాలంటే కనీసం 90 నుంచి 96 గంటల సమయం పడుతుంది. ఇంత సమయం దాకా ఆగలేని వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా కాల్షియం కార్బైడ్, ఇథలిన్ పౌడర్‌లాంటి మార్గాలను అనుసరిస్తున్నారు. కార్బైడ్ మాదిరిగానే ఇథలిన్ పౌడర్ వినియోగించడం ద్వారా కూడా 24 నుంచి 48 గంటల్లోనే కాయలు పండ్లుగా మారుతున్నాయి. మార్కెట్ నుంచి ఎగుమతి అయ్యే పెట్టెలలోనే నేరుగా ఇథలిన్ పౌడర్ ప్యాకెట్లను పెడుతున్నారు. పండ్లను మగ్గించే ప్రక్రియను నిర్వహించేందుకు గడ్డిఅన్నారంలో సుమారు 200 నుంచి 300 మంది మహిళలు, బాలకార్మికులు, హమాలీల ద్వారా ఇథలిన్ పౌడర్ ప్యాకింగ్ చేయిస్తున్నారు.
నేరుగా పండ్లపై పెట్టరాదు
ఇథలిన్ ప్యాకెట్లను నేరుగా పండ్లపై పెట్టరాదు. ఇథలిన్ గ్యాస్ వాడే ప్రక్రియలో ఐదు రకాల పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. చిన్నచిన్న రంద్రాలున్న బాక్స్‌లో ఇథలిన్ ప్యాకెట్లను ఉంచిన తరువాతనే పండ్లను మగ్గబెట్టేందుకు ఉపయోగించాలి. అలా కాకుండా నేరుగా ఇథలిన్ పౌడర్ ప్యాకెట్లను ఉపయోగిస్తున్న వారిపై చర్యలు చేపడతాం. ఇప్పటికే ఈ విషయమై వ్యాపారులతో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. - ప్రవీణ్‌రెడ్డి, ఉన్నతశ్రేణి కార్యదర్శి, గడ్డిఅన్నారం