తెలంగాణ మట్టిలో చైతన్యం : మంత్రి ఈటల

ABN , First Publish Date - 2021-02-01T06:34:51+05:30 IST

తెలంగాణ మట్టిలోనే చైతన్యం ఉందని, ఇక్కడి ప్రజలు ఆకలి తట్టుకుంటారు కానీ, ఆత్మగౌరవం పోగొట్టుకోరని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

తెలంగాణ మట్టిలో చైతన్యం : మంత్రి ఈటల
ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మట్టిలోనే చైతన్యం ఉందని, ఇక్కడి  ప్రజలు ఆకలి తట్టుకుంటారు కానీ, ఆత్మగౌరవం పోగొట్టుకోరని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బీసీ టైమ్స్‌ అండ్‌ మహాత్మాఫూలే ఫౌండేషన్‌ ట్రస్ట్‌ అధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం బీసీ కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. శాటిలైట్‌ కాలంలో సైతం పరువు హత్యలు జరుగుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలన్నారు. మేం తక్కువ, చిన్న కులం వాళ్లమనే ఆత్మనూన్యత భావం పోయినప్పుడే అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుతారన్నారు. సంఘాల మధ్య చర్చలు జరిగినా.. ఆ చర్చలలో సమాజ అభివృద్ధి కీలక భూమిక పోషించాలన్నారు. ప్రపంచానికి ఆదర్శప్రాయమైన చైతన్యం చూపించడం తెలంగాణ ప్రజలకున్న గొప్పతనమని, ఆ చైతన్యంతో పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించుకున్నామన్నారు. ఎంబీసీ వ్యవస్థాపకులు సంగెం సూర్యారావు, మహాత్మాఫూలే ఫౌండేషన్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ డా.వి.రవిశంకర్‌ ప్రజాపతి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన 72 ఏళ్లలో 25 శాతం బీసీ కులాలు చట్ట సభల్లో అడుగుపెట్టలేదన్నారు. బీసీ కులాలను సంఘటితం చేసేందుకు ప్రతినెల చివరి ఆదివారం కలుసుకునేలా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకులా భరణం కృష్ణమోహన్‌, పలు బీసీ సంఘాల ప్రతినిధులు దేవళ్ల సమ్మయ్య, పల్లె సత్యం వంశరాజు, శేఖర్‌సాగర్‌, ఎం.జయంతిరావు, శ్రీనివాసరావు, మెజీషియన్‌ సామల వేణు, జి.సుధాకర్‌, మురళీకృష్ణ, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

మంత్రి సీఎం కావాలంటూ పలువురు ఆకాంక్ష

బీసీ కులసంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. మంత్రి ఈటల భవిష్యత్‌లో సీఎం కావాలంటూ ఆకాంక్షించారు. బీసీ కులాల జాబితాతో రూపొందించిన క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు.  

Updated Date - 2021-02-01T06:34:51+05:30 IST