వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూ ఇంట్లో ఇబ్బంది పడుతున్నారా..?

ABN , First Publish Date - 2021-06-17T14:00:15+05:30 IST

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూ ఇంటిలో ఇబ్బంది పడుతున్నారా..? ....

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూ ఇంట్లో ఇబ్బంది పడుతున్నారా..?

  • ఐఆర్‌సీటీసీ ‘వర్క్‌ ఫ్రమ్‌ హోటల్‌’
  • ప్రకృతి ఒడిలో పరవశిస్తూ పని చేసుకునే అవకాశం
  • పూరీ, కోణార్క్‌, గోపాల్‌పూర్‌ హోటళ్లలో వసతి
  • ఆసక్తి చూపుతున్న ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులు
  • త్వరలో హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతిలోనూ..

హైదరాబాద్‌ సిటీ : వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూ ఇంటిలో ఇబ్బంది పడుతున్నారా..? పొద్దస్తమానం ల్యాప్‌టా‌ప్‌ల ఎదుట కూర్చుని బోర్‌గా ఫీలవుతున్నారా..? కంటి సమస్యలు, నడుం నొప్పితో బాధపడుతున్నారా..? అయితే మీరంతా కొద్ది రోజులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి, ప్రశాంతంగా పనిచేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు, స్వచ్ఛమైన గాలి పీల్చుతూ ప్రకృతి ఒడిలో పరవశిస్తూ పనిచేసుకునే విధంగా ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజువారీ విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా హాయిగా, ఆనందంగా పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. తక్కువ ధరతో, నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆహ్వానిస్తోంది. 


అందుబాటులో ప్యాకేజీ

మాయదారి మహమ్మారి నేపథ్యంలో గతం లో ఎన్నడూ చూడని వింతలు, కొత్త కొత్త వంటకాలు పుట్టుకొస్తున్నాయి. వైరస్‌ సామాజిక వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా జనసమూహాలు అధికంగా పోగయ్యే ప్రాంతాలను గతేడాది మార్చి 16 నుంచి బంద్‌చేశారు. అప్పటి వరకు కార్లు, బైక్‌లపై ప్రతిరోజూ కంపెనీలకు వెళ్లి డ్యూటీ చేస్తున్న ఐటీ ఉద్యోగులకు ఆయా సంస్థలు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ (ఇంటి నుంచి పనిచేసే అవకాశం) ఇచ్చారు. దీంతో నగరంలోని వేలాది మంది ఉద్యోగులు దాదాపు ఏడాదిన్నర కాలంగా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఐటీ ఉద్యోగులతో ప్రారంభమైన వర్క్‌ ఫ్రమ్‌ హోం పద్ధతిని దాదాపు అన్ని ప్రైవేట్‌ రంగాలు తమ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి అలవాటు చేస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పల ఎదుట కూర్చొని, భార్య, పిల్లల మధ్య విధులు నిర్వర్తిస్తూ ప్రశాంతతను కోల్పోతున్నామని మనోవేదనకు గురవుతున్న ఉద్యోగులకు ఉపశమనం కల్పించేందుకు ఐఆర్‌సీటీసీ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. నాలుగైదు రోజులపాటు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోటల్‌ విత్‌ నేచర్‌’(ప్రకృతి చెంతన ఉండే హోటళ్ల)లో బసచేస్తూ రోజువారీ డ్యూటీ చేసే అవకాశం కల్పిస్తోంది.


నాలుగు రోజుల ప్యాకేజీ

‘వర్క్‌ ఫ్రమ్‌ హోటల్‌ విత్‌ నేచర్‌’ ప్యాకేజీలో భాగంగా ఈనెల 9 నుంచి ఒడిశా రాష్ట్రంలోని పూరీ, కోణార్క్‌, గోపాల్‌పూర్‌ బీచ్‌ల వద్ద ఉండే హోటళ్లలో వసతి ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాలను బట్టి నాలుగు రోజుల ప్యాకేజీని అందుబాటులో ఉంచారు. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు పనిచేసేందుకు హైస్పీడ్‌ వైఫై సౌకర్యం, ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్‌ అందిస్తున్నారు. హోటల్‌ గదుల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, ఉద్యోగులను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. త్వరలో హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నంలోని రిసార్టులు, హోటళ్లలో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొస్తామని సికింద్రాబాద్‌ ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ డీఎ్‌సజీపీ కిశోర్‌ తెలిపారు. వివరాలకు సికింద్రాబాద్‌ ఐఆర్‌సీటీసీ జోనల్‌ కార్యాలయంలో 040-27702407, 9701360701, 8287932228 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.


ప్యాకేజీ వివరాలు (4 రోజులు, 3 రాత్రులు)

పూరీ : రూ.6,165 (ప్రారంభ ధర- ఒక్కరికి)

కోణార్క్‌ : రూ.12,600 (ప్రారంభ ధర- ఒక్కరికి)

గోపాల్‌పూర్‌ : రూ.19,945 (ప్రారంభ ధర- ఒక్కరికి)

Updated Date - 2021-06-17T14:00:15+05:30 IST