‘తెలుగు భాషకు కేకేఆర్‌ చేసిన సేవలు వెలకట్టలేనివి’

ABN , First Publish Date - 2021-05-18T12:08:00+05:30 IST

తెలుగు భాషాభివృద్ధికి ఆచార్య కేకే రంగనాథాచార్యులు చేసిన సేవలు వెలకట్టలేనివని

‘తెలుగు భాషకు కేకేఆర్‌ చేసిన సేవలు వెలకట్టలేనివి’

  •  ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాస్‌ 


హైదరాబాద్/అంబర్‌పేట : తెలుగు భాషాభివృద్ధికి ఆచార్య కేకే రంగనాథాచార్యులు చేసిన సేవలు వెలకట్టలేనివని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఎడిటర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. ‘కేకేఆర్‌ గొప్ప మార్గదర్శకుడు, మానవతావాది, వినయశీలి’ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్‌ పూర్వ విద్యార్థులు, తెలుగు భాషా చైతన్య సమితి, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య కేకేఆర్‌ సంస్మరణ సమావేశం సోమవారం వెబినార్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డా. కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేకేఆర్‌ నైతిక ప్రవర్తనకు గీటురాయి అని అన్నారు. కేకేఆర్‌ శిష్యరికం గొప్పదని,  ఆయన శిష్యులు విభిన్న రంగాల్లో నిష్ణాతులుగా ఉన్నారని పేర్కొన్నారు. 


ఆయన పాఠం వినని ఆధునిక విద్యార్థులు కూడా అభిమానించే అగ్రశ్రేణి అధ్యాపకుడు డాక్టర్‌ కేకేఆర్‌ అని అన్నారు. ఆయన  జీవితం ఆలోచన, వృత్తి, ప్రవృత్తి అన్నీ ఒక్కటేనని అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్‌ ప్రాచ్య కళాశాల ప్రిన్సిపల్‌గా, హెచ్‌సీయూ ఆచార్యులుగా, మానవ శాస్త్రాల విభాగం డీన్‌గా ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆధునిక భాషా శాస్త్రవేత్త ఎమెస్కో సంపాదకుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు నేలలో లబ్ధప్రతిష్టులైన భాషా శాస్త్రవేత్తలను, విద్యార్థులను పరిచయం చేసిన ఘనాపాఠి, మేటి గురువు ఆచార్య కేకేఆర్‌ అని అన్నారు. ఈ వెబినార్‌ సమావేశంలో ఆచార్య అయినవోలు ఉమాదేవి, మోతుకూరి నరహరి, తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పి.బడేసాబ్‌, అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, సమన్వయకర్త జయప్రకాష్‌ మల్లయ్య, జనార్ధన్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-18T12:08:00+05:30 IST