అంబులెన్స్‌ ఢీకొని ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2021-02-08T06:02:58+05:30 IST

మృతదేహాన్ని తరలిస్తున్న ఓ అంబులెన్స్‌ సిగ్నల్‌ వద్ద ఓ కారును, మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు

అంబులెన్స్‌ ఢీకొని ఇద్దరికి గాయాలు

ఖైరతాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మృతదేహాన్ని తరలిస్తున్న ఓ అంబులెన్స్‌ సిగ్నల్‌ వద్ద ఓ కారును, మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఉస్మానియా ఆస్పత్రిలో కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఒకరు ఆదివారం మృతి చెందారు. అతడిని సొంతూరుకు తరలించేందుకు అంబులెన్స్‌ను మాట్లాడుకొని కుటుంబ సభ్యులు వెళ్తుండగా, తెలుగుతల్లి చౌరస్తాలో సిగ్నల్‌ పడినా డ్రైవర్‌ ఆగకుండా వెళ్లాడు. ఆకుపచ్చ సిగ్నల్‌ పడడంతో ముందుకు వచ్చిన ఓ స్కోడా కారును, మరో ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టాడు. కారులో ఉన్న భార్యాభర్తలకు గాయాలేమీ కాకున్నా.. కారు ముందుభాగం దెబ్బతింది. కొత్త యాక్టీవా కొని దానికి కొత్త పరికరాలు వేయించుకొని వస్తున్న ఎంఎస్‌ మక్తాకు చెందిన సాయి చరణ్‌(19), బాల చందర్‌లను అంబులెన్స్‌ ఢీ కొనడంతో వారు ఎగిరిపడ్డారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు వారిని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారకుడైన అంబులెన్స్‌ డ్రైవర్‌ ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు, బంధువులు మరో అంబులెన్స్‌లో బాన్సువాడకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


Updated Date - 2021-02-08T06:02:58+05:30 IST