రెండేళ్ల ప్రాయంలో చార్మినార్‌లో తప్పిపోయి.. 15 ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు!

ABN , First Publish Date - 2021-03-21T19:12:44+05:30 IST

రెండేళ్ల వయసులో చార్మినార్‌లో తప్పిపోయిందా బాలిక! తిరిగి 15 ఏళ్ల వయసులో తలిదండ్రుల చెంతకు...

రెండేళ్ల ప్రాయంలో చార్మినార్‌లో తప్పిపోయి.. 15 ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు!

హైదరాబాద్‌ : రెండేళ్ల వయసులో చార్మినార్‌లో తప్పిపోయిందా బాలిక! తిరిగి 15 ఏళ్ల వయసులో తలిదండ్రుల చెంతకు చేరగలిగింది ఆమె! దీని వెనుక సైబరాబాద్‌ పోలీసుల కృషి ఉంది. మానవ అక్రమ రవాణా నిరోధక బృందం ఎట్టకేలకు ఈ మిస్సింగ్‌ కేసును విజయవంతంగా ఛేదించగలిగింది. వివరాలివీ.. కర్నూలుకు చెందిన ఓ ముస్లిం కుటుంబం 2005లో హజ్‌యాత్రకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌లో ఆగి.. చార్మినార్‌ సందర్శనకు వెళ్లింది. అప్పుడే ఆ కుటుంబంలోని రెండున్నరేళ్ల చిన్నారి తప్పిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు హుస్సేనీ ఆలం పోలీసులకు ఫిర్యాదు చేసి వెళ్లిపోయారు. చార్మినార్‌లో తప్పిపోయి గుక్కపట్టి ఏడుస్తున్న బాలికను గుర్తించిన స్థానికులు చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించారు. చైల్డ్‌లైన్‌ అఽధికారులు ఆమెను బోడప్పుల్‌లోని హ్యాపీ హోమ్‌లో చేర్పించారు.


కొన్నాళ్లకు అక్కడి నుంచి మియాపూర్‌లోని వివేకానంద హోమ్‌కు తరలించారు. మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన సైబరాబాద్‌ పోలీసులు.. ఆ హోమ్‌లోని బాలికల వివరాలు ఆరా తీసే క్రమంలో 17 ఏళ్ల బాలిక గురించి తెలిసింది. 2005లో ఆమె మేడిపల్లి హోమ్‌ నుంచి వచ్చిన విషయం, చార్మినార్‌లో తప్పిపోయిన వైనం తెలిశాయి. హుస్సేనీ ఆలం పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్‌ కేసు ఆధారంగా.. ఆ బాలిక కుటుంబ సభ్యులను కర్నూలు నుంచి రప్పించారు. చిన్నప్పటి ఆనవాళ్లు, పుట్టుమచ్చలు, తప్పిపోయిన ప్రాంతం తదితర వివరాలను బట్టి ఆ బాలిక తమ బిడ్డేనని తల్లిదండ్రులు గుర్తించారు. 15 ఏళ్ల తర్వాత తమ బిడ్డ ఆచూకీ తెలియడంతో వారి సంతోషానికి అవధుల్లేవు. పోలీసులు వారికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. నివేదిక రాగానే ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించనున్నట్టు తెలిసింది. అలాగే మరొక కేసును కూడా సైబరాబాద్‌ పోలీసులు విజయవంతంగా పరిష్కరించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక(14)ను ఆమె సొంత రాష్ట్రానికి చేర్చగలిగారు. ఆ బాలికది మేరఠ్‌ జిల్లా గంగానగర్‌. రాజస్థాన్‌లో కూలీగా పనిచేస్తున్న మైనర్‌(17) ఫేస్‌బుక్‌ ద్వారా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు.


అనంతరం హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. గచ్చిబౌలి పరిధిలోని ఓ బస్తీలో గదిని అద్దెకు తీసుకొని ఆ బాలికతో ఉంటున్నాడు. ఆ బాలిక తల్లిదండ్రులు గంగానగర్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా వారిద్దరూ హైదరాబాద్‌లో ఉన్నట్లు యూపీ పోలీసులు గుర్తించారు. లొకేషన్స్‌ ఆధారంగా సమాచారం ఇవ్వడంతో సీపీ సజ్జనార్‌ వెంటనే అప్రమత్తమయ్యారు. మానవ అక్రమ రవాణా నిరోధక బృం దాన్ని రంగంలోకి దింపారు. పోలీసులను ఏమార్చేందుకు ఆ బాలుడు మొత్తం 30 సిమ్‌కార్డులు ఉపయోగించాడని తెలిసింది. 5 రోజులు కష్టపడిన పోలీసులు ఆ మైనర్ల ఆచూకీ తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యూపీ పోలీసులకు అప్పగించారు. అతనిపై రాజస్థాన్‌లో బైక్‌ చోరీతోపాటు పలు దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు చెప్పారు. గత ఐదునెలల్లో 32 మందిని బాధితులను రక్షించారు. 76 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-03-21T19:12:44+05:30 IST