ఆదర్శ వివాహం.. కులాలు, అంగవైకల్యాన్ని జయించిన ప్రేమ

ABN , First Publish Date - 2021-07-02T18:51:18+05:30 IST

వారు కులాలు, అంగవైకల్యం ఇవేమీ ప్రేమకు అడ్డుకావని నిరూపించారు.

ఆదర్శ వివాహం.. కులాలు, అంగవైకల్యాన్ని జయించిన ప్రేమ


హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట : వారు కులాలు, అంగవైకల్యం ఇవేమీ ప్రేమకు అడ్డుకావని నిరూపించారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటై ఏడేళ్ల ప్రేమను పండించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్‌ అనంతపూర్‌ జిల్లాకు చెందిన కొప్పుల వసుంధర చౌదరి కొంత కాలంగా దివ్యాంగుల శ్రేయస్సుకు పాటు పడుతున్నారు. జనగాం జిల్లా అడివి కేశాపూర్‌ గ్రామానికి చెందిన నరేంద్ర వీవ్స్‌ మీడియా పేరుతో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ నడుపుతున్నారు. వారిద్దరికీ ఏడేళ్ల క్రితం పరిచయమైంది. ఇష్టాలు, అభిప్రాయాలు కలవడంతో ప్రేమికులుగా మారారు. 


వసుంధర పుట్టినప్పటి నుంచీ దివ్యాంగురాలు. ఇద్దరి కులాలు వేరు. అయినా పెళ్లి చేసుకుందామనుకున్నారు. అంగవైకల్యం ఉన్న అమ్మాయి అని అబ్బాయి ఇంటి వాళ్లు, కులాంతరం అని అమ్మాయి ఇంటి వాళ్లు పెళ్లికి నిరాకరించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఇతర పెద్దలు ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించడంతో వారు అంగీకరించారు. గురువారం వేద మంత్రాల మధ్య ఎస్సార్‌ నగర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్లో ఆహూతులు, కుటుంబ సభ్యుల మధ్య కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వారి వివాహం జరిగింది. ఈ ఆదర్శ వివాహానికి మాగంటి గోపీనాథ్‌, స్థానిక కార్పొరేట్‌ దేదీప్య, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, సినీ దర్శకులు కమల, ఎంపీడీవో సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాసులు, బుల్లితెర నటుడు లోహిత్‌ తదితరులు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాగంటి వధూవరులకు నూతన వస్ర్తాలు అందజేశారు.

Updated Date - 2021-07-02T18:51:18+05:30 IST