యూకేలో ఉద్యోగం ఇప్పిస్తామని.. నిరుద్యోగికి 13 లక్షలు టోకరా
ABN , First Publish Date - 2021-07-08T18:59:10+05:30 IST
లాక్డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయి...మరో ఉద్యోగం కోసం వెతుకుతున్న వ్యక్తిని

హైదరాబాద్/హిమాయత్‌నగర్ : లాక్డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయి...మరో ఉద్యోగం కోసం వెతుకుతున్న వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు ట్రాప్ చేశారు. యూకేలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ.13 లక్షలు కాజేశారు. సిటీ సైబర్‌క్రైమ్స్ ఏసీపీ కేవీఎం.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. యూసు్‌ఫగూడకు చెందిన అన్నదాత వెంకట మురళీ మనోహర్ గతంలో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేశాడు. లాక్డౌన్లో ఉద్యోగం కోల్పోయాడు. ఉద్యోగం కోసం వివిధ జాబ్ సైట్లలో బయోడేటా నమోదు చేయించుకున్నాడు. రెండు వారాల క్రితం ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ బయోడేటాను విదేశీ సంస్థలకు పంపించామని, యూకేకు చెందిన గ్రీన్‌ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ సంస్థలో మీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యిందని, ఫోన్లో ఇంటర్వ్యూ చేశాక జాబ్ అపాయింట్మెంట్ లెటర్ ఈ-మెయిల్‌కు పంపిస్తారని చెప్పాడు.
నాలుగు రోజుల తర్వాత మళ్లీ మరో వ్యక్తి ఫోన్ చేసి రియల్ఎస్టేట్ సంస్థ ప్రతినిధిని అని, ఫోన్ ఇంటర్వ్యూ కోసం కాల్ చేశానని చెప్పి పలు ప్రశ్నలు అడిగాడు. మరుసటి రోజు మరో వ్యక్తి ఫోన్ చేసి ‘మీకు అపాయింట్మెంట్ లెటర్ ఈ-మెయిల్‌కు పంపిస్తున్నాం’ అని చెప్పి అలాగే పంపించాడు. ఈ-మెయిల్ వచ్చిన తర్వాత మరోసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ వచ్చినందున వీసా ప్రాసెస్ త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుందని, దాంతో పాటు జాబ్ ఇప్పించినందుకు కొంత కమీషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. ముందుగా రూ.5లక్షలు, తర్వాత మరో 5లక్షలు, ఆ తర్వాత జాబ్ కమీషన్ పేరుతో మరో రూ.3లక్షలు ఇలా మొత్తం.రూ.13లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకుని తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయడమే కాకుండా బాధితుడి ఫోన్ నెంబర్‌ను ఈ-మెయిల్‌ను బ్లాక్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్స్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు.
అమీర్‌పేట్‌లో వ్యక్తి ఖాతా నుంచి రూ.9.20 లక్షలు..
కరెన్సీ ట్రేడింగ్ కంపెనీలలో పెట్టుబడి పెడితో వారం పది రోజుల్లో రెట్టింపు లాభాలు వస్తాయని ఓ వ్యక్తిని నమ్మించిన సైబర్ కేటుగాళ్లు పది లక్షల దాకా కాజేశారు. సైబర్‌క్రైమ్స్ ఏసీపీ కేవీఎం.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... అమీర్‌పేట్‌కు చెందిన శ్రీధర్‌రావుకు ఇటీవల ఓ కేటుగాడు ఫోన్ చేశాడు. ‘షేర్మార్కెట్లో మీరు పెట్టుబడులు పెడుతున్నట్లు’ సమాచారం వచ్చిందని, డాలర్లను మన కరెన్సీలోకి మార్చుతూ ముంబైకి చెందిన కరెన్సీ ట్రేడింగ్ కంపెనీలు భారీ లాభాలు గడిస్తున్నాయని చెప్పాడు. వాటిల్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించాడు. తాను ఒక మెసేజ్ పంపిస్తున్నానని, లింక్ క్లిక్‌చేస్తే వివరాలు తెలుస్తాయని చెప్పాడు.
నమ్మిన శ్రీధర్‌రావు లింక్‌ను క్లిక్ చేయగా అది ఎఫ్‌క్యూ మార్కెట్ కంపెనీ పేరుతో ఉన్న పేజీ ఓపెన్ అయ్యింది. తర్వాత మళ్లీ కాల్ చేసిన కేటుగాడు అందులో ఉన్న అకౌంట్ నెంబర్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే అది నేరుగా కరెన్సీ ట్రేడింగ్ షేర్లను ‘మీ పేరుపై కేటాయిస్తుందని, మీకు వచ్చే లాభాలు కూడా అందులో కనిపిస్తాయని’ నమ్మించాడు. నమ్మిన శ్రీధర్‌రావు ముందుగా రూ.2లక్షలు తర్వాత మరో రూ.3లక్షలు..ఇలా మొత్తం రూ.9.20లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత ఆ లింక్ కనిపించకపోవడం, తనకు ఫోన్లు చేసిన నెంబర్లు పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్‌క్రైమ్స్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు.