జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పని చేయండి
ABN , First Publish Date - 2021-03-21T05:45:01+05:30 IST
జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి అన్నారు.

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి
నిర్మల్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్‌లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్య సేవలు, విద్యుత్, అటవీ, సంక్షేమ శాఖలు, పౌర సరఫరాలు, పశుసంవర్థక, ఉద్యాన, మత్స్య, గృహ నిర్మాణం, గ్రంథాలయం, నీటి సరఫరా, పంచాయతీరాజ్, రోడ్డు, భవనాలు, నీటి పారుదల తదితర శాఖలు ఫిబ్రవరి మాసాంతము వరకు సాధించిన ప్రగతిపై సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ, వ్యాక్సిన్ టీకాపంపిణీ సమర్థవంతంగా చేపట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యసేవలు అందించాలని, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ఆమె ఆదేశించారు. అనంతరం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో 500 కోట్లు కేటాయించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జడ్పీటీసీలు పాలాభిషేకం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సుధీర్, జిల్లా అధికారులు వెంకటే శ్వర్లు, ప్రణీత, ధన్‌రాజ్, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, స్రవంతి, రాజేశ్వర్, తది తరులు పాల్గొన్నారు.