పెండింగ్‌ పనులు పూర్తి చేసేదెప్పుడు?

ABN , First Publish Date - 2021-12-31T03:59:02+05:30 IST

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ఎప్పుటిలోగా పూర్తి చేస్తారని జిల్లా పరిషత్‌ సభ్యులు అధికారులను నిలదీశారు. గురువారం పట్టణంలోని వడ్డెపల్లి గార్డెన్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది.

పెండింగ్‌ పనులు పూర్తి చేసేదెప్పుడు?
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి

- అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం

- జడ్పీ సర్వసభ్య సమావేశంలో సమస్యలపై నిలదీత 

ఆసిఫాబాద్‌, డిసెంబరు 30: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ఎప్పుటిలోగా పూర్తి చేస్తారని జిల్లా పరిషత్‌ సభ్యులు అధికారులను నిలదీశారు. గురువారం పట్టణంలోని వడ్డెపల్లి గార్డెన్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ లోకభూమారెడ్డి, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనప్ప, అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో సభ్యులు అధికారుల తీరును ఎండగట్టారు. అభివృద్ధి పనులు చేపట్టడంలో  నిర్లక్ష్యంగా వహిస్తున్నారన్నారు. రోడ్లు, వంతెన నిర్మాణాల్లో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని అధికారులకు సూచించారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. పోస్టుల నియామకాల్లో అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని రోస్టర్‌ పద్ధతిపై నియామకాలు చేపట్టడం లేదని దీంతో అర్హులైన వారు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి కార్పొరేట్‌ స్థాయిలో ఉన్నప్పటికీ వైద్యం సక్రమంగా అందడం లేదన్నారు. ప్రతి చిన్న కేసును కూడా మంచిర్యాల, ఇతర ప్రాంతాలకు రెఫర్‌ చేస్తున్నారని ఆరోపణలున్నాయన్నారు. అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు అంబులెన్స్‌ యజమానులు రోగులను దోపిడీ చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు.

అధికారుల నిలదీత

జడ్పీ సమావేశంలో సభ్యులు ఆయా మండలాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను నిలదీశారు. వాంకిడి మండలంలో ఆశా వర్కర్లను నియమించాలన్నారు. పెంచికల్‌పేట పీహెచ్‌సీలో 108 అంబులెన్స్‌ ఆరు నెలల నుంచి పని చేయడం లేదని సభ దృష్టికి  తీసుకువచ్చారు. ఏజేన్సీలో 32 స్టాఫ్‌ నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని గ్రంథాలయ ఛైర్మన్‌ కనక యాదవ్‌ రావు సూచించారు. రెబ్బెన మండలంలో జీఎన్‌ఎం పోస్టుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని అర్హులైన వారికి అన్యాయం జరిగిందని జడ్పీటీసీ సంతోష్‌, ఎంపీపీ సౌందరయ్య అధికారులను నిలదీశారు. ఆసిఫాబాద్‌, తిర్యాణి రోడ్డు నిర్మాణ పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని తిర్యాణి జడ్పీటీసీ చంద్రశేఖర్‌ ప్రశ్నించారు. ఆసిఫాబాద్‌ మండలం గుండి వంతెన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని, జనవరి 26లోగా పనులు ప్రారంభించకుంటే ఆయా గ్రామాల ప్రజలతో ధర్నాకు దిగుతామని ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌ యాదవ్‌ అన్నారు. జైనూరు మండలంలోని కిషన్‌నాయక్‌ తండా బ్రిడ్జి నిర్మాణ పనులను, కెరమెరి మండలం అనార్‌పల్లి బ్రిడ్జి నిర్మాణపనులను వెంటనే చేపట్టాలని ఆయా మండలాల ఎంపీపీలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమావే శంలో జడ్పీ సీఈవో రత్నమాల, ఆయాశాఖల అధికారులు, జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, తదితరులు పాల్గొన్నారు.

రైతుల వేదికలకు ఏఈవోలు ఎందుకు వెళ్లడం లేదు

-ఎమ్మెల్యే ఆత్రం సక్కు 

రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలకు ఏఈవోలు వెళ్లడం లేదు. రైతులకు ప్రతి అంశంపై అవగాహన కల్పించాల్సి ఉండగా ఏఈవోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన గ్రామాల్లో అటవీ అనుమతులు లేక చాలారోడ్ల పనులు నిలిచిపోయాయి. కనీసం 108,104వాహనాలు పోలేని పరిస్థితి ఉంది. ఆ గ్రామాలకు అటవీశాఖ మొరం రోడ్డుసౌకర్యం కల్పించేందుకు అనుమతులివ్వాలి. 

రైతులకు అవగాహన కల్పించాలి

-ఎమ్మెల్సీ పురాణం సతీష్‌

కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి కొనుగోలు చేయడం లేదని రైతులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. రైతు మేలు చేయటమే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

సమన్వయంతో పనిచేయాలి

-కోవలక్ష్మి, జడ్పీ చైర్‌పర్సన్‌ 

జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అటవీశాఖ అనుమతులు లేని కారణంగా అనేక అభివృద్ధిపనులు నిలిచిపోయాయని వెంటనే అటవీశాఖ అధికారుల అనుమతులు ఇచ్చేలా దృష్టి సారించాలన్నారు.

Updated Date - 2021-12-31T03:59:02+05:30 IST